సుబేదారి/పోచమ్మమైదాన్, ఏప్రిల్ 22: కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యేనని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రీతిది ఆత్మహత్యేనని నిర్ధారణ అయినట్టు శుక్రవారం సీపీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. శనివారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ సీపీని కలిసి ప్రీతి మృతికి గల కారణాలను ఆరా తీశారు.
ఘటన జరిగిన తర్వాత అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేశామన్నారు. ప్రీతి, సైఫ్ వాట్సాప్, కాల్‌లిస్ట్‌ను చెక్చేశామని, పాయిజన్ తీసుకున్న సమయంలో సైఫ్ ఘటనాస్థలంలో లేనట్టు లోకేషన్‌ను బట్టి నిర్ధారించామని, పోస్టుమార్టం రిపోర్ట్‌లో కూడా ఆత్మహత్య అని తేలిందని సీపీ వారికి వివరించినట్టు సమాచారం. ప్రీతిది ఆత్మహత్య కాదని, ఈ ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరుతూ వరంగల్ ఏసీపీ బోనాల కిషన్‌కు ప్రీతి తండ్రి ధరావత్ నరేందర్ ఫిర్యాదు చేశారు. కేఎంసీ అధికారులు, ప్రీతి మృతికి కారకుడైన సైఫ్, అతనికి అనుకూలంగా ఉన్న స్నేహితులపైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.