పరకాల, మార్చి 3: పరకాల సబ్ జైలు నుంచి ఖైదీ పరారయ్యాడు. పోలీసుల తనిఖీల్లో గంటల వ్యవధిలోనే దొరికిపోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో సోమవారం చోటుచేసుకున్నది. జైలర్ ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ములుగు జిల్లా ఏటూరు నాగారానికి చెందిన షేక్ గౌస్పాషాపై 2019లో పోక్సో కేసు నమోదైంది.
మార్చి 18న గౌస్పాషాను పరకాల సబ్ జైలుకు తరలించారు. సోమవారం సబ్ జైలు ఆవరణలో చెత్తను మున్సిపాలిటీ బండిలో వేసేందుకు పాషా జైలు నుంచి బయటకు వచ్చాడు. జైలు సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న జైలు అధికారులు తక్షణమే అప్రమత్తమై పోలీసుల సహకారంతో పరకాల పట్టణం నలువైపులా గాలించారు. పట్టణ శివారులో పంట పొలాల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులకు పాషా దొరికాడు.