హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి పనులు చురుకుగా సాగుతున్నాయి. వానకాలం నేపథ్యంలో అధికారులు పారిశుద్ధ్య పనులకు అధిక పాధాన్యం ఇస్తున్నారు. మురుగు కాల్వల పూడికతీత, పాత భవనాల కూల్చివేత, శిథిలాల తరలింపును వేగవంతం చేశారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లోని డివిజన్లలో ఏర్పాటుచేస్తున్న క్రీడాప్రాంగణాలు అందుబాటులోకి వస్తున్నాయి.
ఐదో రోజు మంగళవారం పల్లె ప్రగతిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 28,329 కిలోమీటర్ల రోడ్లు, 16,382 కిలోమీటర్ల మేర మురుగు కాలువలను శుభ్రం చేశారు. పట్టణ ప్రాంతాల్లో 54,186 టన్నుల చెత్తను తొలగించారు. 5,283 కిలోమీటర్ల మేర రోడ్ల పక్కన ఉన్న పొదలను తొలగించారు. 15,917 టన్నుల శిథిల వ్యర్థాలను తరలించారు. 4,569 కిలోమీటర్ల మేర మురుగు కాలువల్లో పూడికను తీశారు. 636 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను సీజ్ చేసి, రూ.1.10 లక్షల జరిమానా విధించారు. 163 క్రీడాప్రాంగణాలను ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో అమలవుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. తట్టాపార చేతపట్టుకొని ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వాంకుడోతుతండా, రాంక్యాతండాల్లో మంగళవారం జరిగిన కార్యక్రమాల్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే హరిప్రియనాయక్తో కలిసి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శంకుస్థాపన చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా మాచన్పల్లిలో రూ.4.75 లక్షలతో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడాప్రాంగణాన్ని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. పట్టణ ప్రగతిలో భాగంగా కరీంనగర్‌లోని డంప్‌యార్డులో బయోమైనింగ్ ద్వారా క్లీనింగ్ చేసే పనులను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, మేయర్ వై సునీల్‌రావుతో కలిసి బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని విజయనగర్, అస్ర కాలనీల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.