TS Minister Talasani | గత ప్రభుత్వాలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని తెలంగాణ మంత్రి, సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శనివారం ఆయన బేగంపేట లోని ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ముస్లింల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముస్లింల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
మర్రి చెన్నారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా బేగంపేటలో ఖబరస్థాన్ నిర్మించలేక పోయారని తలసాని విమర్శించారు. ఖబరస్థాన్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రెండెకరాల భూమి, రూ.3 కోట్ల నిధులు ఇచ్చిందని చెప్పారు. రైల్వే ట్రాక్ దాటుతూ పలువురు మరణించారని తలసాని గుర్తు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అండర్‌పాస్ నిర్మించి ప్రజల సమస్యలు పరిష్కరించిందన్నారు.
ఐదేండ్ల కాలంలో ప్రజల వద్దకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఒక్కసారైనా వచ్చారా? అని తలసాని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు రావడం వల్లే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ మసియుల్లాఖాన్, హజ్ కమిటీ చైర్మన్ సలీం తదితరులు పాల్గొన్నారు.