హైదరాబాద్ : రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని హోం శాఖమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. మూసారాంబాగ్ డివిజన్లోని శ్రీపురం కాలనీ కమ్యూనిటీహాల్, పాత మలక్పేట డివిజన్లోని ప్రిన్స్ బాడీగార్డ్ లేన్ కమ్యూనిటీ హాల్, సాలార్ యే మిల్లత్ కమ్యూనిటీ హాల్, ఆజంపురా డివిజన్లోని ఝట్పట్ నగర్ కమ్యూనిటీహాళ్లలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలతో కలిసి శుక్రవారం సందర్శించారు.
కేంద్రాల్లో కంటి పరీక్షలు చేస్తున్న తీరు, కళ్లాద్దాల పంపిణీ తీరును పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమంతో దృష్టిలోప సమస్యలు పరిష్కారమవ్వాలని సూచించారు.
పిల్లలు, పెద్దలు అన్నా తేడా లేకుండా కంటి సమస్యలతో బాధపడుతున్న వారు పరీక్షలుచేయించుకోవాలని సూచించారు. జూన్ 30 వరకు కంటి వెలుగు కొనసాగనుందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 250 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. మలక్పేట ఎమ్మెల్యే బలాల మాట్లాడుతూ కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ బిర్జిస్ ఉన్నీసా, వైద్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.