హైదరాబాద్,జనవరి 22 (నమస్తే తెలంగాణ): మహాలక్ష్మి పథకం అమలుకు బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధంచేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఆయన ఉన్నతాధికారులతో సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. రవాణా శాఖ ఆదాయ, వ్యయాలు, గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు, కొత్త బస్సుల కొనుగోలు, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలు తదితర అంశాలపై రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతర మంత్రి పొన్నం మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క అధ్యక్షతన త్వరలో జరుగనున్న సమావేశానికి పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. పీఎఫ్, సీసీఎస్, బాండ్స్‌కు బడ్జెట్లో అవసరమైన కేటాయింపుల గురించి ప్రభుత్వానికి వివరించాలని తెలిపారు. సమావేశంలో రవాణా శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు, ఆర్టీసీ ఎండి సజ్జనార్‌తోపాటు ఆర్టీసీ, రవాణా శాఖ హెచ్వోడీలు పాల్గొన్నారు.