హైదరాబాద్, ఆక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించగానే కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఇటీవల కాలంలో సఖీ సెంటర్లకు విడాకులు, భార్యభర్తల మధ్య అవగాహనలోపం, తల్లిదండ్రుల జోక్యం తదితర అంశాలకు సంబంధించి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రతికేంద్రంలో ఒక లీగల్ సెల్ కౌన్సిలర్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్, హెల్పర్‌ను నియమించనున్నామని పేర్కొన్నారు.