Pravalika | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): శివరామ్ వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ప్రవళిక తల్లి విజయ అన్నారు. నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మంగళవారం ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘రెండు సంవత్సరాల నుంచి నా బిడ్డను హైదరాబాద్‌లో చదివించుకుంటున్నా. నా కొడుకు కూడా అక్కడే చదువుకుంటున్నాడు. ఎండల కాయకష్టం చేసి పిల్లలను చదివిస్తున్నాం. మా పిల్లలకు ఆ కష్టం రావొద్దని హైదరాబాద్‌కు పంపి చదివిస్తున్నాం. కానీ, శివరామ్ అనేటోడు నా బిడ్డను వేధించిండు. అతడి టార్చర్ భరించలేక, మాకు చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. నా బిడ్డ ఆత్మహత్యకు కారణమైనవాడిని శిక్షించాలి.
పార్టీలకు ఏమన్నా గొడవలు ఉంటే మీరు మీరే చూసుకోండి. మా కుటుంబాన్ని అందులోకి లాగకండి. మీ రాజకీయాలకు మమ్మల్ని బలి చేయకండి. నా బిడ్డ చావుకు కారణమైనవాడిని మాత్రం బయటకు రానీయకండి. శిక్ష వేయండి’ అని వేడుకున్నారు. ప్రవళిక సోదరుడు కుమార్ మాట్లాడుతూ ‘అక్క హాస్టల్‌కు, నా హాస్టల్‌కు ఐదు నిమిషాల దూరం ఉంటుంది. మా అక్కను తరుచూ కలుస్తుంటా. మా అక్క చనిపోవడానికి శివరామ్ అనే వ్యక్తే కారణం. వేరే అమ్మాయి ద్వారా మా అక్కకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి మా అక్కకు ఇష్టం లేకపోయినా మాట్లాడటం, ఫోన్ చేయటం, హాస్టల్‌కు వచ్చి అందరిముందు ఇబ్బంది పెట్టాడు. ఎవరితో చెప్పుకోవాలో తెలియక, మా అమ్మ, నాన్న, నాకు చెప్తే ఏమనుకుంటారో అని డిప్రెషన్‌కు వెళ్లి సూసైడ్ చేసుకున్నది.
మా అక్క మరణానికి కారణం అయిన శివరామ్‌ను ఎక్కడున్న పట్టుకొచ్చి ఉరితీయాలి. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. ఈ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని చెప్పాలని కాంగ్రెస్ వాళ్లు మా దగ్గరకు వస్తున్నారు. దయచేసి మా దగ్గరకు రాకండి. ఈ అంశంపై రాజకీయం చేయకండి’ అని ప్రాధేయపడ్డాడు. అటు.. ప్రవళిక ఆత్మహత్య ఘటనను సీరియస్‌గా తీసుకొన్న పోలీసులు.. కేసులో మరికొన్ని సెక్షన్లను జోడించారు. ముందుగా అనుమానాస్పద స్థితి మృతిగా నమోదుకాగా, 174 ఐపీసీ సెక్షన్లను మార్చి, 417, 420, 306 ఐపీసీ సెక్షన్లు జోడించారు. మోసం, ప్రవళిక ఆత్మహత్యకు కారణం(అబెట్మెంట్ టు సూసైడ్) కింద ఈ కొత్త సెక్షన్లను జోడించారు. పరారీలో ఉన్న శివరామ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు.