శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 14: ప్రపంచంలోనే మహాద్భుతమైన భగవద్రామానుజ ఆవిష్కారఘట్టం పరిపూర్ణమైంది. 216 అడుగుల పంచలోహ మూర్తి హైదరాబాద్కు తలమానికంగా నిలిచింది. చివరిరోజైన సోమవారం నాడు 120 కిలోల స్వర్ణంతో రూపొందించిన రామానుజుల వారి మూర్తికి త్రిదండి చిన జీయర్ స్వామి ప్రాణ ప్రతిష్ఠచేశారు. మహా పూర్ణాహుతి తరువాత యాగశాల నుంచి సమతాస్ఫూర్తి కేంద్రం వరకు పెరుమాళ్ల శోభాయాత్ర సాగింది. ఆ తరువాత స్వామివారికి విశేష అభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మైహోం గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్రావుతోపాటు పలువురు పాల్గొన్నారు. సహస్రాబ్ది సమారోహంలో భాగంగా ఈ నెల రెండోతేదీన 144 యాగశాలల్లోని 1035 హోమకుండా ల్లో సాగిన లక్ష్మీనారాయణ యాగం దిగ్విజయం గా పరిసమాప్తి అయింది. ఈ పన్నెండు రోజుల్లో పదికోట్ల అష్టాక్షరి మంత్ర జపంతో ముచ్చింతల్ దివ్యసాకేతం మార్మోగింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా దేశవ్యాప్తంగా ప్రముఖులు సమతామూర్తిని దర్శించుకొని వెళ్లారు. సమతామూర్తి దర్శనంకోసం సోమవారం శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు మహేశ్వరం, కందుకూరు, కొత్తూరు, నందిగామ, షాద్నగర్, మొయినాబాద్ మండలాలతో పాటు హైదరాబాద్ నగరానికి చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.