హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టును చట్టపరంగా అడ్డుకుంటామని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టుపై సీఎల్పీ నేతలకు 30న ప్రజాభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించాలని, అందుకు సిద్ధంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ మహమ్మద్ అమ్జద్ హుస్సేన్, ఈఎన్సీ ఓఅండ్ఎం శ్రీనివాస్, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్లతో జలసౌధలో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. బనకచర్ల, ఎస్ఎల్బీసీ, దేవాదుల, మేడిగడ్డ పునరుద్ధరణ తదితర అంశాలపై సమీక్షించారు. బనకచర్లపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశామని, త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
తెలంగాణా నీటిపారుదల శాఖకు సలహాదారుగా ఉండాలని భారత సైన్యంలో ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా పనిచేసిన జనరల్ హర్బల్ సింగ్‌ను ఆహ్వానించామని చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగం నిర్మాణం కోసం టన్నె ల్ టెక్నాలజీ నిపుణుడు కర్నల్ పరీక్షిత్ మెహ్రా జూలైలో చేరుతారని వివరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల మరమ్మతులకు ఎన్డీఎస్ఏ డిజైన్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తుందని, సిఫారసులను సత్వరమే అమల్లో తేవాలని అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ పనులను తర్వగా పూర్తి చేసేందుకు ప్రతి వారం సమీక్షించి నివేదికలు సమర్పించాలని, కేంద్ర జలసంఘం సూచనలకు అనుగుణంగా పనులు చేయాలని సూచించారు. డిండి ప్రాజెక్ట్ భూసేకరణకు కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని చెప్పా రు.
ఎస్ఎల్బీసీ పనుల కోసం అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీలతో చర్చించి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నామని, ఖర్చుకు వెనుకాడకుండా ముందుకు పోతామని తెలిపారు. నీటిపారుదల శాఖలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా నాగార్జునసాగర్, నిజాంసాగర్ తదితర ప్రాజెక్టుల పూడికతీత పనులను సత్వరం ప్రారంభించాలని, ఈ విషయంపై ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనుల పురోగతితో పాటు సీతారామ ప్రాజెక్టుకు ప్రస్తుతం కేటాయించిన నిధుల పరిమితులకు లోబడి అదనపు ప్యాకేజీలను రూపొందించే అంశాలపై అధికారులు దృష్టి సారించాలని చెప్పారు.