(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ముందుచూపు కొరవడటంతో కిందటేడాది తెలంగాణ మినహా దాదాపు అన్ని రాష్ర్టాల్లో విద్యుత్తు కోతలు నెలకొన్నాయి. డిమాండ్‌కు సరిపడా విద్యుదుత్పత్తి జరుగకపోవడంతో గత వేసవిలోనూ విద్యుత్తు కోతలు కొనసాగాయి. గత అనుభవాల నుంచి ఇంకా పాఠాలను నేర్వని కేంద్రం ఇప్పుడు మళ్లీ అదే పొరపాట్లు చేస్తున్నట్టు కనిపిస్తున్నది.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (సీఈఏ) ఛైర్పర్సన్ ఘన్‌శ్యామ్ ప్రసాద్ చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు కారణం. డిమాండ్‌కు సరిపడా విద్యుత్తు సరఫరాలో ముందస్తు ప్రణాళికలు లేకుంటే వచ్చే ఏడాది కరెంటు సంక్షోభం ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇటీవల జరిగిన 13వ ఎనర్జీ కాన్క్లేవ్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. వచ్చే ఏప్రిల్ నాటికి దేశంలో విద్యుత్తు డిమాండ్ 230-235 గిగా వాట్లకు పెరుగవచ్చని అంచనా వేశారు. ప్రస్తుత డిమాండ్ 215 గిగా వాట్లతో పోలిస్తే ఇది 9 శాతం ఎక్కువ అన్నారు. ముందస్తు ప్రణాళికలు లేకపోతే వచ్చే ఏడాది కరెంటు సంక్షోభం ఎదుర్కోక తప్పదన్నారు.
తెలంగాణలో వెలుగులు
గత ఏడాది దేశంలోని అన్ని రాష్ర్టాల్లో విద్యుత్తు కోతలు కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రమే ఆ పరిస్థితి కనిపించకపోవడం గమనార్హం. విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా సీఎం కేసీఆర్ ముందుచూపుతో చర్యలు తీసుకోవడంతో రాష్ర్టానికి విద్యుత్తు కష్టాలు రాలేదు. సంక్షోభంలోనూ వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తూ, ఎండాకాలంలోనూ గృహ, పరిశ్రమ రంగాలకు కోతలు లేకుండా విద్యుత్తును సరఫరా చేస్తూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.