కవాడిగూడ, ఏప్రిల్ 26: కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేటి సమాజానికి చైతన్యదీప్తి అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. నాడు లోకకల్యాణం కోసం పాటుపడిన స్వామివారి సేవలను నేడు స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయ న విగ్రహానికి పూలమాల వేశారు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవ సమి తి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఈ వే డుకలు సమితి కన్వీనర్ అడ్లూరి రవీంద్రాచారి అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడారు.
సమాజంలో మూఢ విశ్వాసాలను ఖండిస్తూ అజ్ఞానంలో మగ్గిపోతున్న జనావళికి ఆయన జ్ఞానోదయాన్ని కలిగించిన క్రాంతిదర్శి అని కొనియాడారు. బ్రహ్మంగారి కాలజ్ఞాన వేదవాక్కులు నేడు సత్యవాక్కులుగా నిరూపితమవుతున్నాయని చెప్పారు. ప్రజలకు జీవనతత్వాన్ని బో ధించిన మహాసంఘ సంస్కర్త అని తెలిపారు. భవిష్యత్తులో జరుగబోయే విషయాలన్నీ మానవాళికి ముందే చెప్పిన కాలజ్ఞాని అని ప్రశంసించారు. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశాచారి, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్చారి, బీసీ కులసంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలబోజు నరసింహాచారి, తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ అనంతోజు బ్రహ్మచారి, విశ్వకర్మ సం ఘం నాయకులు పూసాల బ్రహ్మచారి, సుంకోజు లింగాచారి, కృష్ణాచారి, అనంతాచారి, రాఘవేంద్రాచారి పాల్గొన్నారు.