హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): పాలిసెట్ మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. దీంతో విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్‌బుక్ చేసుకోవాలి. ఈ నెల 22 నుంచి 25 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 22 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక, ఈ నెల 30లోపు సీట్లను కేటాయిస్తారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో నిరుడితో పోల్చితే ఈ ఏడాది 1,122 సీట్లు అదనంగా చేరాయి. నిరుడు 25,290 సీట్లుండగా, ఈ ఏడాది 26,412కు చేరింది. 115 కాలేజీల్లో (58 ప్రైవేట్, 57 ప్రభుత్వ) 26వేలకు పైగా సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవలే అనుమతి ఇచ్చింది. ఈ సీట్లను కన్వీనర్ కోటాలో వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు.