హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): శక్తి పాలసీ.. పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ ఇండియా యూనివర్సిటీలో విలీనంపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. నాలుగైదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సర్కార్ నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో పాలిటెక్నిక్ జేఏసీ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. సహాయ నిరాకరణ (నాన్ కో-ఆపరేషన్)కు పిలుపు ఇచ్చింది. శనివారం నుంచి సహాయ నిరాకరణ పాటిస్తున్నట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనను కలిసిన జేఏసీ నేతలు సహాయ నిరాకరణ నోటీసు అందజేశారు.
సాంకేతిక విద్యామండలి కార్యదర్శికి సైతం నోటీసు సమర్పించారు. సహాయ నిరాకరణలో భాగంగా అదనపు బాధ్యతలు, విధులకు దూరంగా ఉండనున్నట్టు జేఏసీ చైర్మన్ నాగరాజు, సెక్రటరీ జనరల్ శ్రావణ్‌కుమార్ ప్రకటించారు. సాంకేతిక విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్‌లోని అదనపు విధులు నిర్వహించబోమని తేల్చిచెప్పారు. న్యాయమైన డిమాండ్లకు సర్కార్ పరిష్కారం చూపే వరకు సహాయ నిరాకరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక నుంచి అదనపు బాధ్యతలకు దూరంగా ఉంటామని.. తాము రెగ్యులర్ డ్యూటీలు మాత్రమే నిర్వహిస్తామని, అదనపు సమయం పనిచేయబోమని తేల్చిచెప్పారు.