హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మున్నూరుకాపులను రాజకీయంగా, సామాజికంగా అణచివేసేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారని, వాటిని తిప్పికొట్టకపోతే సమాజ ఉనికికే ప్రమాదమని మున్నూరుకాపు ఎంపీలు, సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కులగణన నివేదిక మున్నూరుకాపులపై వివక్షాపూరితంగా ఉన్నదని, ఇది ముమ్మాటికీ తప్పుల తడక అని ఆరోపించారు. మున్నూరుకాపు ఫౌండేషన్ ట్రస్ట్ బాధ్యుల ఆధ్వర్యంలో రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం వివిధ పార్టీల కీలక నేతలు సమావేశమయ్యారు.
ఈ భేటీలో రాజ్యసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ వద్దిరాజు రవిచంద్ర, బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొని కుల ప్రయోజనాలే లక్ష్యంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో మున్నూరు కాపుల జనాభాను కేవలం మూడు శాతంగా చూపించడంపై నేతలు తీవ్రంగా స్పందించారు. ఇది రాజకీయంగా దెబ్బతీసే కుట్ర అని ధ్వజమెత్తారు. పార్టీలకు, భావజాలాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపులు ఏకం కావాలని, తమ హకుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. త్వరలోనే హైదరాబాద్‌లో సమావేశమై ప్రభుత్వ వైఖరిపై కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టంచేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన ఐదెకరాల స్థలంలో మున్నూరుకాపు ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఆర్థిక వనరుల సమీకరణ, సమన్వయ లోపాలను అధిగమించి త్వరగా పనులు పూర్తి చేయాలని భావించారు. ఢిల్లీ పర్యటనలో మున్నూరుకాపు ఫౌండేషన్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రైతు కనకయ్య, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు పుటం పురుషోత్తం, సభ్యులు లక్ష్మణ్, విష్ణువర్ధన్, రమేశ్హజారి, రాష్ట్ర నాయకులు ఈసంపల్లి వెంకన్న కాశటి కుమార్, రామారావు, సామల వేణు, వెంగళ రమేశ్, మహిళా నేతలు కొణతం దీపిక, ఆకుల శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.