హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తేతెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఆరు జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమ కొండతోపాటు వరంగల్ జిల్లా పరిధిలోని పట్టణ పరిధిలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ప్రభుత్వ బాలికల పాఠశాల వెస్ట్‌మారేడుపల్లిలో చిన్నారికి చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 0-5 ఏండ్లలోపు 17,32,171మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నామని, ఇందుకు 6897 బూత్‌లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆదివారం 16,35,432 మందికి పోలియో డ్రాప్స్ వేశామని తెలిపారు. వైద్య ఆరోగ్య సిబ్బంది సోమ, మంగళవారాల్లో హైదరాబాద్ జిల్లాలో ఈనెల 15న ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని పేర్కొన్నారు. ఆరు జిల్లాలకు సంబంధించి 259 మొబైల్ టీమ్స్ అందుబాటులో ఉంటాయని వివరించారు. చిన్నారుల తల్లిదండ్రులు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.