హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యలే కేంద్రీకృతంగా పోలీసులు పనిచేయాలని, తాను 14 నెలలపాటు డీజీపీగా అదే పనిచేశానని జితేందర్ అన్నారు. ఉద్యోగ విరమణ సందర్భంగా సోమవారం డీజీపీ కార్యాలయ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో తాను సిటిజన్ సింట్రెక్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చానని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది, అధికారుల కృషి వల్ల తాను డీజీపీగా ఉన్నప్పుడు ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా పేరు తెచ్చుకోవడంపై సంతోషం వ్యక్తంచేశారు. భవిష్యత్తులోనూ చిత్తశుద్ధితో పనిచేసి తెలంగాణ పోలీస్ శాఖ స్థాయిని కొనసాగించాల్సి ఉందని సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలీస్ సిబ్బంది మరింత మెరుగ్గా రాణిస్తున్నారని పేర్కొన్నారు.