Telangana | రాజన్న సిరిసిల్ల/ హాజీపూర్/ఎర్రవల్లి చౌరస్తా, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ) : ‘పోలీసులా.. లేక కూలీలా? పండుగలేదు. పబ్బంలేదు. రోగమొచ్చినా సెలవివ్వరు.. మా భర్తలు నెలకోసారి ఇంటికి వస్తే ఎలా.. వాళ్లతో వెట్టిచాకిరి చేయిస్తారా..’ అంటూ బెటాలియన్‌కు చెందిన పోలీస్ కుటుంబాలు రోడ్డెక్కాయి. బెటాలియన్ పైస్థాయి అధికారులకు సేవలు చేయించుకోవడంపై మండిపడ్డాయి. టీజీ ఎస్పీ డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశాయి. గురువారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్ ఎదుట రహదారిపై కానిస్టేబుళ్ల భార్యలు తమ పిల్లలతో కలిసి ధర్నాకు దిగారు. సిరిసిల్ల పట్టణ శివారులోని సర్దాపూర్‌కు చెందిన 17వ బెటాలియన్ పోలీసు కుటుంబాలు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని పదోపటాలం సిబ్బంది భార్యలు.. చిన్నారులు, కుటుంబసభ్యులతో కలిసి జాతీయరహదారి-44పై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొట్టకూటి కోసం పోలీసు ఉద్యోగంలో చేరిన తమ భర్తలతో ఉన్నతాధికారులు వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబాల సభ్యులు అనారోగ్యం పాలైనా కనీసం సెలవులు కూడా మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలకన్నా సెలవులుంటాయని, పోలీసులు మనుషులు కాదా? అంటూ ప్రశ్నించారు. టీజీఎస్పీ కానిస్టేబుళ్ల లీవ్ మాన్యూవల్ ప్రకారం తమ భర్తలు నెలకోసారి ఇంటికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భార్యా పిల్లల్ని, తల్లిదండ్రులను చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు, విరామం లేకుండా డ్యూటీలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడు, కర్నాటక రాష్ర్టాల మాదిరి విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని, తెలంగాణ పోలీస్ బెటాలియన్‌లో ఆకస్మిక బదిలీలు లేకుండా ఐదేళ్లపాటు ఒకే దగ్గర పనిచేసేలా పోస్టింగ్‌లు ఇవ్వాలని, సివిల్, ఏఆర్ పోలీసుల మాదిరిగా బెటాలియన్ పోలీసులకు విధులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిరిసిలల్లో డీఎస్పీ చంద్రశేఖర్ వారికి ఎంత నచ్చజెప్పినా శాంతించలేదు. దీంతో ధర్నా చేస్తున్న పోలీసు కుటుంబాల సభ్యులను స్థానిక పోలీసులు సర్దాపూర్‌లోని బెటాలియన్‌కు తరలించారు. ఎర్రవల్లి మండలంలోని జాతీయరహదారిపై ధర్నా కారణంగా మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జాం అయ్యింది.