సూర్యాపేట, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ: రాజకీయ ఒత్తిళ్లో… పైరవీకారుల దందానో.. పైసల ప్రభావమో తెలియదుకానీ.. సూర్యాపేట జిల్లాలో పోలీసుల బదిలీలు ఓ ప్రహసనంలా మారాయి. పలు స్టేషన్లలో పని చేస్తున్న సిబ్బందిని ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ చేయడం… తిరిగి యథాస్థానానికి బదిలీ చేయడం, మరి కొందరు తొలి స్థానం నుంచి సమీపంలోని మరో చోటకు వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇలాంటి బదిలీలు కొన్ని వారం రోజుల వ్యవధిలో జరిగితే.. మరికొన్ని నెల రెండు నెలల వ్యవధిలో జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఎలాంటి పలుకుబడిలేనివారు కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొద్ది కాలంగా సూర్యాపేట పోలీస్‌శాఖలో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐదారు నెలలకాలంలో నూతనకల్ మండలం మిర్యాలలో మాజీ సర్పంచ్ హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు వచ్చిన ఆరోపణలతో డీఎస్పీ, ఇన్స్పెక్టర్లను బదిలీ చేయగా స్థానిక ఎస్ఐని మాత్రం కదలించకపోవడంతో ఉన్నతాధికారులపై భారీ ఎత్తున ఆరోపణలు వినిపించాయి.
తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లో పని చేసిన ఎస్ఐ క్రషర్ మిషన్ వ్యాపారి పెట్టిన ఓ కేసులో విచారణ పేరిట బాధితుడిని పిలిపించి చితకబాదడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటూ ఎస్ఐ పేరు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ పీడీఎస్ బియ్యం రవాణా విషయంలో నిందితుడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేస్తామని రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయ్యారు. సూర్యాపేటలో అర్హతలేని డాక్టర్లు, అనుమతులులేని దవాఖానలకు నోటీసులు ఇచ్చి వైద్య ఆరోగ్యశాఖ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు రాగా.. తామేం తక్కువా అంటూ ఈ విషయంలో కేసులు నమోదు చేసి బాధితుల నుంచి రూ.16 లక్షలు డిమాండ్ చేయగా డీఎస్పీ, పట్టణ ఇన్స్పెక్టర్లు ఏసీబీకి చిక్కిన ఘటన రాష్ట్రంలోనే సంచలనం రేపింది.
జిల్లాలో కొంతకాలంగా ఇష్టారాజ్యంగా పోలీసు బదిలీలు జరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడంలేదని కింది స్థాయి సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. సూర్యాపేట రూరల్‌లో పని చేస్తున్నవారిని అనంతగిరి, చిలుకూరుకు బదిలీ చేసి పదిహేను రోజుల్లో తిరిగి సూర్యాపేట రూరల్‌కు తీసుకువచ్చారని విశ్వసనీయంగా తెలిసింది.
చివ్వెంలలో పనిచేస్తున్న ఒకరిని నూతనకల్‌కు బదిలీ చేసి కొద్ది రోజుల్లోనే మళ్లీ సూర్యాపేట రూరల్‌కు కేటాయించారు. కోదాడటౌన్ నుంచి అనంతగిరి.. తిరిగి కోదాడ టౌన్‌కు, చిలుకూరు నుంచి కోదాడ మళ్లీ చిలుకూరు బదిలీ ఇలా జిల్లాలో 25కు పైనే అటు ఇటు బదిలీ అయినట్టు .పోలీస్ సిబ్బంది చెబుతున్నారు. సాధారణంగా కౌన్సెలింగ్ ద్వారా ఆప్షన్ ప్రకారం పోస్టింగ్ ఇవ్వడం లేదంటే కోరుకున్న చోటుకు దగ్గర్లో ఉండే చోటకు బదిలీ చేస్తారు. కానీ జిల్లాలో బదిలీలు మాత్రం అర్థంపర్థం లేకుండా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడైనా తప్పులు చేసిన వారిని ఇంటర్నల్ బదిలీలు చేస్తారు.. కానీ ఎలాంటి మచ్చ లేకుండా సర్వీసు ఉన్నవారిని ఇష్టారాజ్యంగా దూరప్రాంతాలకు బదిలీలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.