హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదంటూ కొత్త పోలీస్ చట్టంలోని సెక్షన్ 163 ద్వారా విధించిన నిషేధాజ్ఞలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు 10 వామపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో జరిగిన సంయుక్త సమావేశంలో వామపక్ష నేతలు మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ తదితర శక్తులు రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులను ప్రోత్సహిస్తున్నాయని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు ఈ నెల 15 నుంచి డిసెంబర్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు జేవీ చలపతిరావు, సీ పీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీరయ్య, నరసింహారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలమల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.