మధిర, జనవరి 24 : ఖమ్మం జిల్లా మధిర మండలం నిధానపురంలో ఓ దొంగతనం కేసులో పోలీసులు షేక్బాజీని అరెస్ట్ చేశారు. ఈ కేసులో భార్య, తల్లిదండ్రులు కూడా ఖమ్మం రావాల్సి ఉంటుందని సూచించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన భార్య ప్రేజా తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి, తానూ ఉరివేసుకుంది. భార్య, పిల్లలు మృతిచెందినా పోలీసులు మాత్రం కడసారి చూసేందుకు కూడా బాజీకి అవకాశం కల్పించలేదు. రాత్రి సమయంలోనే అతడిని కోర్టుకు రిమాండ్ చేసి జైలుకు పంపించారు. దీంతో శుక్రవారం చాన్బీ, షేక్ గఫూర్ కోడలు, మనవరాళ్ల అంత్యక్రియలు నిర్వహించారు. మధిర సీఐ మధు, ఎస్సై లక్ష్మీభార్గవి బందోబస్తు నిర్వహించారు. మతాంతర వివాహం చేసుకున్న కూతు రు మౌనిక(ప్రేజా) మృతదేహాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు లక్ష్మి, భూషణ్ భోరు న విలపించారు. మృతదేహాలకు జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న భార్య, పిల్లలను కడసారి చూసేందుకు భర్తకు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు.