నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్రాథోడ్ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించేందుకు అనుమతివ్వాలని శుక్రవారం పిటిషన్‌ను దాఖలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నిందితుడి రిమాండ్‌కు సంబంధించిన సాక్ష్యాధారాలను జిల్లా కోర్టులో సమర్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల 9వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దయభాస్కర్రావు.. శివరామ్‌కు బెయిల్ మంజూరు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రవళికతో నిందితుడికి ఉన్న పరిచయాలకు సంబంధించి ఫోరెన్సిక్ నుంచి సేకరించిన ఆధారాలను జిల్లా కోర్టుకు సమర్పించనున్నారు.
నిందితుడిని రిమాండ్‌కు తరలించే అవకాశం లేదని, పోలీసుల విచారణ కొనసాగుతున్న నేపథ్యం లో కోర్టు చొరవ తీసుకోకూడదని మెజిస్ట్రేట్ జారీచేసిన ఉత్తర్వుల ప్రతులను గురువారం పీపీ ద్వారా అధికారులు తీసుకున్నారు. మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట సాక్ష్యాధారాలను సమర్పించకపోవడం వల్ల బెయిల్ మంజూరు కావడం తో నిందితుడి రిమాండ్ కేసు డైరీలో నమోదు చేసిన సాక్ష్యాధారాలను జతచేసి పిటిషన్‌ను జిల్లా కోర్టులో దాఖలు చేయనున్నారు.