నిజామాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నరహంతకుడు రియాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శుక్రవారం రాత్రి నిజామాబాద్ నగరంలో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను అతి దారుణంగా కత్తితో గుండెలో పొడిచి చంపి, పరారైన విషయం తెలిసిందే.. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డీజీపీ సీరియస్ కావడంతో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయిచైతన్య రంగంలోకి దిగి రియాజ్‌ను పట్టుకునేందుకు 10 బృందాలు ఏర్పాటు చేశారు. శనివారం అర్ధరాత్రి ఓ బైక్‌ను దొంగతనం చేసి పారిపోతుండగా పోలీసులు నిజామాబాద్ శివారు సారంగపూర్‌లో వెంబడించగా బైక్‌ను పడేసి నిజాంసాగర్ కెనాల్ దాటుకుని రియాజ్ పారిపోయాడు. ఆదివారం ఉదయం పాడుబడ్డ లారీలో నక్కిన రియాజ్‌ను పోలీసులు గుర్తించారు. పోలీసులకు సహకరించేందుకు యత్నించిన ఆసిఫ్ అనే యువకుడిపై రియాజ్ కత్తితో దాడి చేయడంతో గాయ మైంది. పోలీసులు వెంటనే రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
24 ఏండ్లకే నరహంతకుడిగా…
నరహంతకుడు రియాజ్ వయసు 24 ఏండ్లే. పిన్న వయసులోనే అనేక నేరాలు, ఘోరాలతో రౌడీ షీటర్ అవతారం ఎత్తాడు. నిరుడు కరుడుగట్టిన రౌడీషీటర్ ఆరిఫ్‌ను నరికి చంపిన కేసులోనూ రియాజ్ నిందితుడిగా ఉన్నాడు. ఆధిపత్యం కోసం రౌడీషీటర్‌ను చంపి అందరినీ భయపెట్టాడు. 50కి పైగా బుల్లెట్ వాహనాలను దొంగిలించిన కేసుల్లో పాత్రధారిగా ఉండగా, నాలుగైదు సార్లు జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చాడు. తిరిగి నేర ప్రవృత్తితోనే చెలరేగుతూ చివరకు కానిస్టేబుల్‌ను హత్య చేశాడు. రియాజ్‌ను అదుపులోకి తీసుకునే ముందు జాగ్రత్తలు పాటించకపోవడంతోనే కానిస్టేబుల్ ప్రాణం తీశాడు.
ఎన్కౌంటర్ జరగలేదు : సాయి చైతన్య, నిజామాబాద్ పోలీస్ కమిషనర్
నర హంతకుడు రియాజ్‌ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్ అనే యువకుడితో జరిగిన పెనుగులాటలో ఇరువురికి గాయాలైనట్టు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్కౌంటర్ లాంటిది ఏదీ చోటు చేసుకోలేదని స్పష్టంచేశారు. ఇరువురిని దవాఖానకు తరలించిన క్రమంలో పలువురు సోషల్ మీడియాలో పుకార్లను వ్యాప్తి చేశారని తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిందంటూ పలు మీడియాలో ప్రసారం చేయడంతో గందరగో ళం ఏర్పడిందని పేర్కొన్నారు. తప్పుడు ప్రచా రం చేసిన వారిపై చర్యలుంటాయన్నారు.