హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తెలంగాణ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ద్వారా రూ.704.50 కోట్లతో జిల్లా పోలీస్ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్లు, పోలీస్స్టేషన్ల భవనాలు, ఇతర నిర్మాణాలను చేపట్టినట్లు రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. కార్పొరేషన్ ఎండీ ఐపీఎస్ రాజీవ్ రతన్తో కలిసి బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సంకల్పం, ఆలోచనలకు అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో పోలీసు భవనాలను కార్పొరేట్ కార్యాలయాలకు తీసిపోని విధంగా నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లా పోలీస్ కార్యాలయాల భవనాలు, సిద్దిపేట, కామారెడ్డి, రామగుండం, వరంగల్ పోలీస్ కమిషనరేట్ల నిర్మాణాలను చేపట్టామని తెలిపారు. జిల్లా పోలీస్ అధికారుల భవనాలను ఒకొకటి రూ.38.50 కోట్లతో నిర్మిస్తున్నట్లు చెప్పారు.
పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ 137 పోలీస్ స్టేషన్లకు భవనాల నిర్మిస్తున్నదని, వాటిలో 109 పూర్తికాగా, 28 పూర్తికావొస్తున్నాయని చెప్పారు. పట్టణ పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణానికి రూ.4.25 కోట్లు, గ్రామీణ ప్రాంత పోలీస్స్టేషన్ భవనాల నిర్మాణానికి రూ.2.70 కో ట్ల చొప్పున ఖర్చు చేస్తున్నామన్నారు. జంటనగరాల్లోని నిజాంకాలం నాటి భవనాల స్థానంలో 67 కొత్త భవనాలను రూ.175.68 కోట్లతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 87 భవనాలను ప్రారంభించామన్నారు.