ఎదులాపురం, మార్చి19 : ఆదిలాబాద్ జిల్లా కలకలం సృష్టించిన ఏడీసీసీబీ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన శ్రీపత్కుమార్ను పోలీసులు అరెస్టుచేశారు. శనివారం ఆదిలాబాద్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. బేల మండల కేంద్రంలోని ఏడీసీసీ బ్యాంకులో రూ.2.85 కోట్లు తారుమారు అయినట్లు ఈ నెల 13న బ్యాంకు ఆదిలాబాద్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గడ్డం శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై బ్యాంకు సిబ్బంది విచారణ చేపట్టారు. నిందితుడు బ్యాంకు స్టాఫ్ అసిస్టెంట్స్ శ్రీపత్కుమార్గా గుర్తించారు. ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడిన నిందితుడు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కాడు. డొప్టాల పీఏసీఎస్ బేల, పీఏసీఎస్ సొసైటీల పేరు మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశాడు. బ్యాంక్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ల అనుమతి లేకుండా వారి పాస్వర్డ్ వాడుకొని, ఫేక్ లోన్ అకౌంట్ల ద్వారా కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి రూ.2.85 కోట్లను ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత వారి అకౌంట్ల నుంచి సహ ఉద్యోగులు బండి రమేశ్, ఎస్ ప్రవీణ్, జీ ప్రవీణ్, రాహుల్, సవిత, ప్రణీత, వేణుగోపాల్, నితిన్, రమేశ్ అకౌంట్లలోకి రూ.37.97 లక్షలు బదిలీ చేశాడు. సత్యదేవ్ టెక్నాలజీ, పూసం బొటిక్, నేహాలాల్వాని, గోపీచంద్ ఇతర బెట్టింగ్ ఏజెన్సీలలో శ్రీపత్కుమార్ రూ.1,40,05,106 పోగొట్టుకున్నాడు. బండి రమేశ్ రూ.26.60 లక్షలు, శ్రీపత్ రూ.20 లక్షలు జల్సాల కోసం వాడుకొన్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.97 లక్షల వరకు రికవరీ చేశారు.