శేరిలింగంపల్లి, జులై 7 : వీకెండ్ థీమ్పార్టీల పేరుతో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్న ఖాజగూడలోని ‘ది కేవ్ పబ్’పై పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారంతో ఎస్వోటీ, యాంటీ నార్కోటిక్, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా దాడిచేసి పబ్‌లో పట్టుబడ్డ వారందరి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. గంజాయి సేవించిన 24 మందిని అరెస్ట్ చేశారు. పబ్ మేనేజర్‌తో పాటు మొత్తం 25 మందిని అరెస్టు చేయగా నలుగరు పబ్ యజమానులు పరారీలో ఉన్నారు. రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబందించి వివరాలను గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ జీ వినీత్ వెల్లడించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి ఖాజగూడలోని ఎస్వీ అర్కేడ్ భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న ‘ది కేవ్ పబ్’పై ఎస్వోటీ, యాంటీ నార్కోటిక్ బృందాలు, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా దాడిచేశారు. ఆ సమయంలో పబ్‌లో ఉన్న 55 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా 24 మంది గంజాయి, ఇతర మత్తుపదార్థలు సేవించినట్టు తేలింది. సైకాలెడిక్ పార్టీ పేరుతో ఫారెస్ట్ ఆల్కహాలిక్ థీమ్‌తో నిర్వహించిన ఈవెంట్లో వీరంతా పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు. గంజాయి, ఇతర డ్రగ్స్ పబ్‌లో లభించలేదని, పార్టీకి వచ్చేముందే వీరంతా గంజాయి సేవించి వచ్చినట్టు వివరించారు. పబ్ యజమానులు రాజేష్, అభినవ్, సాయికృష్ణ, సన్నీలపై కేసు నమోదు చేశారు. కాగా వీరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.