సూర్యాపేట, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): తుంగతుర్తి నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎమ్మెల్యే సామేల్ ఆదేశాల మేరకే తమను స్టేషన్‌కు తరలించారని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. సామేల్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పార్టీ కేడర్‌ను కనీసం పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు అర్వపల్లి మండల కేంద్రంలో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఎమ్మెల్యే సామేల్ పోలీసులను ఉసిగొలిపి తెల్లవారుజామున 4 గంటలకు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఇండ్లపై దాడి చేయించి హౌజ్ అరెస్టులు చేయించారని, మరికొందరిని ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారని సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్వపల్లి, శాలిగౌరారం, నాగారం మండలాలకు చెందిన మోరపాక సత్యం, అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, నర్సింగ్ శ్రీనువాస్‌గౌడ్, వేల్పుల రమేశ్, శిగ నసీర్ తదితరులను అరెస్టు చేసి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతనకల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టులను నిరసిస్తూ.. కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. డీసీసీ ఉపాధ్యక్షుడు ధరూరి యోగానందచార్యులు స్టేషన్‌కు చేరుకుని అధికార పార్టీ నాయకుల అరెస్టును ఖండించారు.