ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 08, 2020 , 17:27:06

లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ప్రధానిని కోరిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ

లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ప్రధానిని కోరిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ

హైదరాబాద్‌:  దేశంలో కరోనా వ్యాప్తిని  సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్‌డౌన్‌  పొడగింపునకు మించిన మార్గంలేదని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ.. ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టం చేసింది. లాక్ డౌన్‌ను  కొనసాగించాలని కోరింది.  ప్రధాని మోదీ బుధవారం పార్లమెంటులో అన్ని రాజకీయ పక్షాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో హైదరాబాద్‌ నుంచి టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె. కేశవరావు, లోక్ సభపక్ష నాయకుడు నామా నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. టిఆర్ఎస్ పార్టీ  వైఖరిని డాక్టర్ కేశవరావు ప్రధాన మంత్రికి స్పష్టంగా తెలియచేశారు. 

భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో బాగున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇరవై నాలుగు గంటల పాటు కష్టపడుతున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న లాక్ డౌన్ ను కొనసాగించాలా వద్దా అన్నది మన మెదళ్ళలో ఉంది.  కానీ నేను మాత్రం లాక్ డౌన్ ను కొనసాగించాలని కోరుతున్నాను. లాక్ డౌన్ వల్ల కష్టనష్టాలున్నప్పటికీ ఇది తప్పని చర్య.  ప్రతికూల పరిస్థితుల్లో ఇదే ఉత్తమమైన మార్గం. మనం ఒకసారి పట్టువిడిస్తే పరిస్థితులు అధ్వాన్నంగా తయారవుతాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడమే మన ముందున్న ప్రథమ కర్తవ్యం. ఎక్కువ వైద్య సదుపాయాలు లేని గ్రామాలకు వైరస్ విస్తరిస్తే పరిస్థితి  చేయి దాటి పోతుంది. ముందు ఈ బాధ నుండి విముక్తి లభిస్తే తరువాత ఏమైనా చేసుకోవచ్చు. మన ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందనే విషయం మాకూ తెలుసు. కానీ మానవ మనుగడను పణంగా పెట్టి ఆర్థిక వృద్ధిని ప్రాధాన్యంశంగా చూడవద్దు అని  కేశవరావు కోరారు. 

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల ఉత్పన్నమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి చాలా కష్టపడుతున్నాం. వలస కూలీల బాగోగులు చూసుకుంటున్నాం. పేద కుటుంబాల్లోని ప్రతీ ఒక్కరికి 12 కిలోల బియ్యం, ప్రతీ కుటుంబానికి రూ. 1500 నగదు అందిస్తున్నాం. మిగతా సీఎంలు బాగానే పనిచేస్తున్నప్పటికీ, మా ముఖ్యమంత్రి  కేసీఆర్‌ ప్రతీ రోజు రాత్రి పొద్దు పోయేవరకు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. దేశంలో ఆహారధాన్యాలు సమృద్ధిగానే ఉన్నాయి. వాటిని అవసరమైన వారికి అందించాలి. 60 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు గోదాముల్లోనే ఉన్నాయి. 440 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. ఐతే అవన్నీ కావాల్సిన వారికి అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలోనే మనం వెనుకబడి ఉన్నాం. కానీ సంక్షోభాలను సమర్థవంతంగా అధిగమించే శక్తి మనకుందని అనేకసార్లు రుజువైంది. ఇప్పుడు కూడా మన ప్రయత్నాలు తప్పక విజయం సాధిస్తాయి. 

అభివృద్ధి చెందిన దేశాల జిడిపిలో సపోర్ట్ ప్యాకేజ్ 10 శాతం ఉంటే, మనకు కేవలం 1 శాతమే ఉంది. దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వడ్డీరేట్లను కూడా తగ్గించాలి. ఆర్బిఐ మంచి నిర్ణయాలే తీసుకుంది. మార్కెట్లో డబ్బు ఎక్కువ అందుబాటులో ఉండేట్లు చూడాలి.  మనం ద్రవ్యలోటు, ఎఫ్ఆర్ బిఎం లాంటి ఆర్థిక లక్ష్యాల గురించి చింతించాల్సిన పని లేదు. రాష్ట్రాలకు కావాల్సిన నిధులు అందించాలి. పాత బకాయిలు కూడా చెల్లించాలి. కరోనా వ్యాప్తి నివారణకు మీరు తీసుకున్న నిర్ణయాలకు నా మద్దతు ఉంటుంది. కేవలం పీఎంఓ ద్వారానే నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు రావు, వికేంద్రీకరణ చాలా ముఖ్యం. జీతాల్లో కోత, ఎంపి ల్యాడ్స్ విషయంలో నిర్ణయాన్ని మేము ఇప్పటికే అంగీకరించాం. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక నిర్వహణా విధానాలు ఏకీకృత నిధుల వినియోగానికి ప్రతిబంధకంగా ఉన్నాయి.  ప్రభుత్వం ఈ ఇబ్బందులను తొలిగించాలి. 

రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ముఖ్యమంత్రులు వారి బాధ్యతలను వారు నిర్వర్తించగలరు. వారికి స్వేచ్చనివ్వండి. తెలంగాణలో రాబడులు పడిపోయాయి. రోజుకు రూ. 400 కోట్ల రాబడి రావాల్సి ఉండగా, అత్యంత కష్టంగా కేవలం రూ. 1 కోటి ఆదాయమే సమకూరుతోంది. కావున మాకు మరిన్ని నిధులు సమకూర్చండి. అయినప్పటికీ కరోనా వైరస్ నియంత్రణ దిశగా ప్రభుత్వం మరింత పట్టుదలతో ముందుకు సాగుతోంది. మీ ప్రభుత్వ కార్యదర్శలు సమర్పించిన నాలుగు ప్రెజెంటేషన్ లు బాగున్నాయి. 

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సమాచారం విషయంలో ఇబ్బందులున్నప్పటికీ,  ఈ సమస్యలను అధిగమించి  ప్రభుత్వం సరైన సౌకర్యాలను కల్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది. సంఘటితంగా పోరాడితేనే కరోనా వైరస్ ను సమర్థంగా ఎదుర్కోగలం. మేము కరోనా పై విజయం సాధిస్తాం.  రాష్ట్రంలో రబీ పంట కొనుగోళ్ళకు సంబంధించి ప్రభుత్వం మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నదని  కేశవ రావు వివరించారు. logo