హైదరాబాద్, డిసెంబర్29 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్, నర్సింగ్, ఇతర కళాశాలలు 2017-18 నుంచి 2024-25 సంవత్సరం వరకు పెండింగ్ ఉన్న ఉపకార వేతనాల దరఖాస్తు ఫారాల హార్డ్ కాపీలను అందజేయాలని బీసీ సంక్షేమశాఖ ఆదేశించింది. ఆదివారం ప్రకటన విడుదల చేసింది. జనవరి 20లోగా జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యాలయాల్లో సమర్పించాలని తెలిపింది. ఈ-పాస్ వెబ్సైట్లో చాలా అప్లికేషన్లలో నో ఫీజు అని చూపుతున్నదని, కళాశాల యాజమాన్యాలు సోషల్వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పీఎం యూ సెంటర్‌ను సంప్రదించి ఫీ స్ట్రక్చర్‌ను అప్డేట్ చేయించుకోవాలని సూచించింది. సాలర్షిప్, ట్యూషన్ ఫీజు రాకపోతే పూర్తి బాధ్యత కళాశాల యాజమాన్యాలదేనని, వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తామని బీసీశాఖ వెల్లడించింది.
డిగ్రీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్‌ను రూపొందించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. గ్రా మీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా దీనిని అందుబాటులోకి తీసుకురానుంది. సబ్జెక్టుకు చెందిన ముఖ్యాంశాలు గ్రహించేలా, పరీక్షలకు సన్నద్ధం చేయడానికి స్టడీ మెటీరియల్ తోడ్పడుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. లోతైన అధ్యయనం చేసేవారి కోసం రెఫరెన్స్ పుస్తకాల వివరాలను సైతం పొందుపరుస్తామని పేర్కొన్నారు. డిగ్రీ కోర్సుల సిలబస్‌ను 30శాతం చొప్పున మార్చాలని ఇప్పటికే మండలి నిర్ణయించింది. ఇందుకోసం కొత్త సిలబస్‌ను రూపొందిస్తున్నది.