హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): దున్నపోతు ఈనిందంటే.. దూడను కట్టేయమన్నట్టుగా గత కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై మీడియాలో కథనాలు సాగుతున్నాయి. అయితే, ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించేలా ఒక ఆసక్తి గల పరిణామం శనివారం చోటుచేసుకొన్నది. రాజకీయ వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిశోర్ శనివారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. ఉదయం 9.30 గంటలకు నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకొన్న ప్రశాంత్ కిశోర్.. దేశ రాజకీయాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సాయంత్రం వరకు సుదీర్ఘంగా చర్చించారు. ప్రశాంత్ కిశోర్ రాత్రి ప్రగతిభవన్లోనే బసచేసినట్టు సమాచారం. సీఎంతో ఆయన చర్చలు ఆదివారం కూడా కొనసాగనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పీకే సోమవారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నది. కాగా, జాతీయ రాజకీయాల్లో త్వరలో పెను మార్పులు సంభవించనున్నాయని.. వాటిపై సరైన సమాచారం లేని.. కొన్ని సమాచార సాధనాలు.. నిర్హేతుకమైన నిరాధారమైన కథనాలు చెప్తున్నాయని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.