దుబ్బాక, జనవరి 5 : ఏసీబీ అధికారుల పేరిట ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరిస్తే మున్సిపల్ అధికారి 50 వేలు సమర్పించుకొన్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై గంగారాజు వివరాల ప్రకారం.. దుబ్బాక మున్సిపల్ ఏఈ యాదగిరికి ఐదు రోజుల క్రితం ఓ అపరిచితుడు ఫోన్ చేశాడు. ‘మేం ఏసీబీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. మీపైన పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రైడ్ చేయకుండా ఉండాలంటే వెంటనే రూ.2 లక్షలు అకౌంట్‌కు పంపించాలి’ అని ఆదేశించాడు. బెదిరిపోయిన యాదగిరి అకౌంట్‌కు ఫోన్‌పే ద్వారా రూ.50 వేలు పంపించారు. మిగిలిన రూ.1.50 లక్షలు వెంటనే పంపించాలని బెదిరింపు కాల్స్ వచ్చాయి. యాదగిరి 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు ఎస్సై గంగరాజు తెలిపారు. ఈ ఘటనతో యాదగిరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతికి పాల్పడకపోతే అపరిచితుడికి రూ.50 వేలు ఎందుకు పంపించాల్సి వచ్చిందన్న ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.