హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్టలో బాలికలను అక్రమంగా తరలించడమే కాకుండా వారికి బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి వ్యభిచార కూపంలోకి నెట్టినట్టు 2018లో తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. జస్టిస్ కే సుజన మంగళవారం ఈ కేసు విచారణ చేపట్టారు. నిందితులు కామసాని రాజేశ్వరి, అనిత, వంశీ, జమున, జ్యోతిపై నమోదైన అభియోగాలు నిరాధారమైనవని వారి తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసును ప్రత్యేక అధికారి దర్యాప్తు చేయాలన్న నిబంధనకు విరుద్ధంగా పోలీసులే దర్యాప్తు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. అంతేకాకుండా తమపై లైంగిక దాడి జరిగినట్టు పిల్లలు మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పలేదని పేర్కొంటూ.. ఈ కేసును కొట్టివేయాలని కోరారు. దీనిపై అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్ గణేశ్ స్పందిస్తూ.. నిందితులు అక్రమంగా బాలికలను తరలిస్తున్నారని, వారి శరీర సౌష్టవాన్ని పెంచేందుకు బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి వ్యభిచార కూపంలోకి నెడుతున్నారని తెలిపారు. దీంతో నిందితుల పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.