Tax | న్యూఢిల్లీ, అక్టోబర్ 17: సగటు వేతనజీవి నుంచి ముక్కు పిండి పన్ను వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం పన్నులను కుదిస్తున్నది. ఫలితంగా ప్రభుత్వ మొత్తం పన్ను ఆదాయంలో ప్రజలు కట్టే వ్యక్తిగత ఆదాయ పన్ను వాటా పెరుగుతుండగా, కార్పొరేట్ పన్నుల వాటా మాత్రం తగ్గుతున్నది. ముఖ్యంగా కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను మారుస్తూ 2019లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి రావాల్సిన కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిపోతున్నది. 2000-01 నుంచి 2023-24 మధ్య వసూలైన పన్నుల వివరాలను ఆదాయ పన్ను శాఖ గురువారం వెల్లడించింది. ఇందులో ఈ విషయాలు స్పష్టమయ్యాయి.
ప్రత్యక్ష పన్నులు(వ్యక్తిగత ఐటీ, కార్పొరేట్ ట్యాక్స్ వంటివి), పరోక్ష పన్నులు(జీఎస్టీ, ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ వంటివి) కలిపి ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం పన్నులో వ్యక్తిగత ఆదాయ పన్ను వాటా 2004-05లో 16.2 శాతంగా ఉండగా, 2023-24లో ఏకంగా 30.2 శాతానికి పెరిగింది. ప్రత్యక్ష పన్నులో చూసుకుంటే 2023-24లో వ్యక్తిగత ఆదాయ పన్ను వాటానే 53.3 శాతంగా ఉంది. ఇప్పుడు విడుదల చేసిన 24 ఏండ్ల డాటాలో ఇదే అత్యధికం.
ఇదే సమయంలో ప్రభుత్వ మొత్తం పన్ను వసూళ్లలో కార్పొరేట్ పన్నుల వాటా తగ్గుతున్నది. ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేట్ ట్యాక్స్ వాటా 2018-19లో 58.3 శాతం ఉండగా, 2023-24 నాటికి పెరగకపోగా 46.5 శాతానికి తగ్గింది. 2019లో కార్పొరేట్ పన్నులను మోదీ ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు కారణమని స్పష్టమవుతున్నది. ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు కార్పొరేట్ పన్ను వసూలు 64 శాతం మాత్రమే పెరగగా, వ్యక్తిగత పన్ను వసూలు మాత్రం 112 శాతం పెరిగింది. ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయనే ఆశతో 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను మోదీ ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు కారణమని, అయినా పెట్టుబడులు మాత్రం పెరగలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.