Solar Panels | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): పర్యావరణానికి హాని చేయకుండా కరెంటును ఉత్పత్తి చేసేవిగా పేరొందిన సోలార్ ప్యానెల్స్ భవిష్యత్తులో ఇకపై కనిపించకపోవచ్చు. జపాన్‌లో ఇప్పటికే వీటి వాడకాన్ని తగ్గించేశారు. సంప్రదాయ సోలార్ ప్యానెల్స్ స్థానంలో పెరోవ్‌స్కైట్ అనే కొత్త ప్యానెల్స్‌ను తీసుకొచ్చారు. తక్కువ ధరలో ఎక్కువ కరెంటు ఉత్పాదకతే లక్ష్యంగా వీటిని తీసుకొచ్చినట్టు పరిశోధకులు చెప్తున్నారు.
ఏమిటీ ‘పెరోవ్‌స్కైట్ ప్యానెల్స్’?
సోలార్ ప్యానెల్స్ సాధారణంగా సిలికాన్ మెటీరియల్‌తో తయారు చేస్తారు. అయితే పెరోవ్‌స్కైట్ ప్యానెల్స్‌ను కాల్షియమ్ టైటానేట్ అనే మెటీరియల్‌తో తయారు చేస్తారు. ఇదీ సెమీకండక్టర్. వెలుతురిని గ్రహించి దాని తీవ్రతను రెట్టింపు చేయడమే కాదు ప్రత్యేక కెపాసిటర్లలో ఎక్కువకాలం స్టోర్ చేసుకొనే సదుపాయమూ దీంట్లో ఉన్నది. 30 ఏండ్లపాటు ఏకబిగిన కరెంటును ఉత్పత్తి చేసే ఈ పెరోవ్‌స్కైట్ ప్యానెల్స్ ధర.. సంప్రదాయ సోలార్ ప్యానెల్స్ కంటే ఎంతో తక్కువ.
‘సోలార్ ప్యానెల్స్’ కంటే ఎలా మెరుగు??
రెండు గదుల ఇంట్లో ఉండే ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, నాలుగు ఫ్యాన్లు, ఐదు బల్బులకు విద్యుత్తును సరఫరా చేయాలంటే 2కిలోవాట్ సోలార్ ప్యానెల్ అవసరం. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని కలుపుకొన్నప్పటికీ దీని కొనుగోలుకు రూ. 60 వేలు ఖర్చు చేయాలి. సూర్యకాంతి ఉన్నప్పుడే ఇవి పనిచేస్తాయి. స్టోరేజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని అమర్చడానికి ప్రత్యేకంగా ఇంటి పైకప్పు అవసరం. రాళ్లవాన, పిడుగులు పడినప్పుడు నాశనమయ్యే ప్రమాదం ఉన్నది.
అయితే, పెరోవ్‌స్కైట్ ప్యానెల్స్‌లో ఈ సమస్యలు లేవు. వీటి ధర చాలా తక్కువ. ఎనర్జీ స్టోరేజీ ప్రాబ్లమ్స్ లేవు. ఇంటి పైకప్పు మీదనే అమర్చాల్సిన అవసరం లేదు. వెలుతురు పడే ఎక్కడైనా బిగించవచ్చు. కాల్షియమ్ టైటానేట్తో తయారైన ప్రత్యేక ఫిల్మ్ ఎంతో ధృడమైనది. రాళ్ల వానవంటివి ఈ ప్యానెల్స్‌ను నాశనం చేయలేవని పరిశోధకుల అభిప్రాయం. రష్యాలోని కొన్ని నగరాల్లోనూ ఈ తరహా ప్యానెల్స్ వినియోగం పెరిగినట్టు నిపుణులు చెప్తున్నారు.