హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): సంప్రదాయ పంటలతోపాటు లాభసాటిగా ఉండే వాణిజ్య పంటల సాగు ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఈ జాబితాలోకి వెదురు వచ్చి చేరింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశం ఉన్న ఈ పంట రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. దేశంలో వెదురుకు విపరీతమైన డిమాండ్ ఉండడం, అందుకు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో ప్రభుత్వాలే ఈ పంటను ప్రోత్సహిస్తున్నాయి. నేషనల్ బ్యాంబూ మిష న్ పథకం ద్వారా దేశ్యాప్తంగా వెదురుసాగుపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. వెదురు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50శాతం రాయితీ కూడా అందిస్తున్నాయి. అస్సాం, పశ్చిమబెంగాల్, అండమాన్ నికోబార్, మధ్యప్రదేశ్‌ల్లో వెదురును ఎక్కువగా సాగుచేస్తున్నారు. నేషనల్ బ్యాంబూ మిషన్ పథకం ద్వారా మన రాష్ట్రంలో గత రెండేళ్లలో 1.05 లక్షల ఎకరాల్లో వెదురును సాగుచేస్తున్నారు.
బంజరు భూములు అనుకూలం
వెదురుపంటకు బంజరు భూములు కూడా అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ నీటి అవసరం లేకుండానే సాగుచేసుకోవచ్చు. ఒకసారి నాటిన మొక్క నుంచి 50 ఏండ్లపాటు ఉత్పత్తి ఉంటుంది. కూలీల అవసరం కూడా పెద్దగా ఉండదు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాలతోపాటు మెట్ట ప్రాంతాల్లోనూ వెదురుసాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. బ్యాంబూ మిషన్ ద్వారా రైతులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నది. హెక్టారు భూమిలో 1500 మొక్కలు నాటుకోవచ్చు. మొక్కకు మొక్కకు మధ్య 2.5 మీటర్లు, వరుసకు వరుసకు మధ్య 3 మీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి.
బోల్డన్ని రకాలు
వెదురులో చాలా రకాలున్నాయి. కాబట్టి మేలైన రకాన్ని రైతులు ఎంచుకోవాల్సి ఉంటుంది. బ్యాంబూసా అరుండినేసియా, బాంబూసా పాలిమార్ఫా, కిమోనో బాంబూసా బెరిఫెరా వంటివి రకాలకు మంచి డిమాండ్ ఉంది. మంచి ధర కూడా లభిస్తుంది. కాబట్టి వీటిలో ఏదో ఒకదానిని ఎంచుకుని సాగుచేయవచ్చు. 50 శాతం సబ్సిడీ కోసం రైతులు నేషనల్ బ్యాంబూ మిషన్ అధికారిక వెబ్సైట్ nbm.nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొక్కనాటిన నాలుగేండ్లకు..
నాటిన నాలుగేండ్ల తర్వాత వెదురు మొదటి కోతకు వస్తుంది. నాలుగేండ్లలో ఎకరానికి రూ. 4 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. ఈ లెక్కన హెక్టారుకు రూ. 12 ఆదాయం సమకూరుతుంది. సాలుకు సాలుకు మధ్య ఉన్న ఖాళీలో ఇతర పంటలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలు కూడా ఉంటుంది.