నాగర్ కర్నూల్ : రైతుల కరెంటు కట్ చేసి కష్టాలకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Rule ) , రేవంత్ సర్కార్ అధికారాన్ని కట్ చేసేందుకు రైతులు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( Singireddy Niranjan Reddy ) అన్నారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల అసమర్ధ పాలనకు నిరసనగా నాగర్ కర్నూల్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు.

స్థానిక వెలమ ఫంక్షన్ హాల్ నుంచి సబ్స్టేషన్ వరకు రైతులు, ట్రాక్టర్లతో భారీ నిరసన ర్యాలీని చేపట్టి హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్తు , సకాలంలో విత్తనాలు, ఎరువులు, రైతుబంధు, ప్రభుత్వ మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు వంటి బృహత్తర కార్యక్రమాలను రైతుల కోసం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇచ్చిన వసతులు రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వడని రైతులు ప్రశ్నిస్తున్నారన్నారు. తాము ఇంతకంటే గొప్పగా రేవంత్ రెడ్డి ఇస్తాడని నమ్మి మోసపోయామని రైతులు బాధపడుతున్నారని వెల్లడించారు.
తెలంగాణ రైతుల పాలిట శనిగా కాంగ్రెస్ సర్కార్ మారిందని దుయ్యబట్టారు. రైతులకు నీరు ఇవ్వకపోతే ఏ తంటా ఉండబోదని గ్రహించి కృష్ణ, గోదావరి నదులలో సమృద్ధిగా నీరు ఉన్న నీటిని ఎత్తిపోయడానికి చేసిన నిర్లక్ష్యమే నేడు తెలంగాణ రైతుల కొంప ముంచిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుపై ఉన్న ఆంధ్ర ప్రాజెక్టులకు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రతిరోజు 10 టీఎంసీల మేర నీటిని తరలించకుపోతుంటే రేవంత్ సర్కార్ కళ్లు అప్పగించి చూస్తుందే తప్ప తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడడంలో నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
నాడు నేడు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ నిండుగా ముంచిందని ఆరోపించారు. నాడు ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగా శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులను నిర్మాణం చేసి తెలంగాణకు ద్రోహం చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన చంద్రబాబుకు శిష్యుడైన రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండడం వల్ల నీటి దోపిడీకే పాల్పడుతున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
సీఎం 420 హామీలు హామీలే: మర్రి జనార్దన్ రెడ్డి

ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ఒక్కటి సక్రమంగా నెరవేర్చక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 420 సీఎంగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి మోసం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు పతనం తప్పదన్నారు. కెసిఆర్ ను తిట్టడం తప్ప ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మూడేళ్ల చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.