హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): బస్సుల్లో ప్రయాణమంటేనే ప్రజలు భయపడుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులైనా, ఆర్టీసీ బస్సులైనా జర్నీ అంటేనే ప్రజలు జంకుతున్నారు. వరుస రోడ్డు ప్రమాదాలే ఇందుకు కారణం. ఇటీవల కర్నూలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు అంటుకొని 20 మంది ఆహుతి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ అధికారుల నిఘా పూర్తిగా కొరవడింది. పరిమితికి మించి ప్రయాణానికి తోడు ఓవర్ స్పీడ్‌తో ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు నగరంలోనే కలకలం సృష్టిస్తున్నారు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా జెట్స్పీడ్తో దూసుకెళ్తున్నారు. ఇక రాత్రిపూట ఔటర్ దాటితే చాటు.. బస్సుల రేసింగ్ జరుగుతుందా? అన్నట్టు శరవేగంగా దూసుకెళ్తున్నాయి. దీంతో ఇంజిన్ వేడెక్కి.. మంటలు చెలరేగుతున్నాయి. డ్రైవర్లు విచక్షణ కోల్పోయి చేసే డ్రైవింగ్‌కు ప్రయాణికులు బలవుతున్నారు. హైదరాబాద్ నుంచి బయల్దేరే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఓఆర్ఆర్ దాటిన తర్వాతనే ప్రమాదానికి గురవుతున్నాయి. అవి కూడా రాత్రిపూట, తెల్లవారుజామునే ఎక్కువగా జరుగుతున్నాయి.
ప్రైవేటు బస్సులను గాలికొదిలేసిన ఆర్టీసీ
హైదరాబాద్-నల్లగొండ మధ్యలో జాతీయ రహదారి 65పై మూండేండ్లలో ఆరు భారీ ప్రమాదాలు సంభవించాయి. ఈ నెల 11న హైదరాబాద్ నుంచి నెల్లూరు బయల్దేరిన ట్రావెల్స్ బస్సు చిట్యాల తర్వాత వచ్చే ఎలిమినేడు వద్ద పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల అప్రమత్తతతో 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి చేస్తున్న ఆర్టీఏ అధికారులు.. ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల రెగ్యులర్ తనిఖీల విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్ బస్సులను స్లీపర్ కోచ్‌లుగా మార్చుకోవడం, ఫిట్నెస్ లేకపోయినా రోడ్డెక్కడం సర్వసాధారణమైంది. చాలా ప్రైవేటు బస్సుల్లో భద్రతా చర్యలు కూడా తీసుకోవడంలేదు. ప్రమాదాలు జరిగినప్పుడు తలుపులు తెరుచుకోకపోవడం, గ్లాస్లు బద్దలు కొట్టేందుకు సుత్తెలు లేకపోవడం వంటివి ప్రయాణికుల ప్రాణాలకు భద్రత లేకుండా చేస్తున్నాయి. ఆర్టీఏ అధికారులకు ముడుపులు ముట్టడంవల్లే పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు చచ్చిపోయినా ఫర్వాలేదు.. అధికారులు తమ జేబులు నిండితే చాలు అనుకుంటూ.. ప్రైవేటు బస్సులను గాలికి వదిలేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాతో అధికారులు కుమ్మక్కు కావడంవల్లే భద్రతా ప్రమాణాలు పాటించని.. మృత్యుశకటాల్లాంటి బస్సులు రోడ్డెక్కుతున్నాయి.
ఆదే దారిలో.. ఆర్టీసీ బస్సులు!
సాధారణంగా ఆర్టీసీ బస్సులు అంటే సురక్షిత ప్రయాణానికి చిరునామా. కానీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, పర్యవేక్షణ కొరవడటం, అధికారుల నిర్లక్ష్యంతో ఆర్టీసీ బస్సులు కూడా వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. డ్రైవర్లు, కండక్టర్ల సంక్షేమంపై గురించి కార్పొరేషన్ పెద్దలు పట్టించుకోవడంలేదు. కనీసం విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా డ్యూటీలు వేస్తున్నారు. దీంతో 16-18 గంటలు అవిశ్రాంతంగా డ్రైవింగ్ చేసి, అలసిపోతున్నామని, కంటి మీద కునుకులేక ప్రమాదాలు జరుగుతున్నాయని డ్రైవర్లు చెప్తున్నారు. నైట్‌హాల్ట్ డ్రైవర్లకు కేవలం 3-4 గంటలు మాత్రమే నిద్రకు అవకాశం ఇవ్వడం అమానవీయతకు నిదర్శనమని వాపోతున్నారు. ఆర్టీసీలో ఫిట్నెస్ లేని బస్సులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయని వివరిస్తున్నారు. ఫిట్నెస్ లేకపోవడం వల్ల బస్సులు హఠాత్తుగా ఆగిపోవడం, ప్రమాదాలకు గురికావడం పరిపాటిగా మారిందని చెప్తున్నారు. అది చాలదన్నట్టు డొక్కు బస్సులతో కేఎంపీఎల్ పెంచాలని టార్గెట్లు పెట్టడం వల్ల ఒత్తిడికి గురవుతున్నట్టు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మీ ప్రాణాలకు మీరే బాధ్యులు!
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అయినా, ఆర్టీసీ బస్సు అయినా.. వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు అంటే, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తున్నది. ఏదైనా తప్పనిసరి అయితేనే రాత్రిపూట ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. బస్సులో ప్రయాణించేటప్పుడు ఫలానా బస్సు సేఫ్ అనే భావన ఉండటంలేదు. ఏదైనా బస్సును అధికారులు తనిఖీ చేసి ఉంటారులే అని నమ్మే పరిస్థితి అసలేలేదు. ఎవరి ప్రాణాలకు వాళ్లే బాధ్యులు, సొంత రిస్క్ మీద బస్సు ఎక్కాలనే ఆలోచనతో ప్రయాణాలు సాగించాల్సి వస్తున్నది.
