హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): అండగా ఉంటాం.. అధైర్య పడొద్దని బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త కుటుంబానికి ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, నేతలు భరోసా ఇచ్చారు. శశిధర్‌గౌడ్‌ను ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాది అని ధైర్యం చెప్పారు. రంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఇటీవల అరస్టైన బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త దుర్గం శశిధర్‌గౌడ్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను మంగళవారం పరామర్శించారు. మనం భయపడాలని ముఖ్యమంత్రి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఏమాత్రం భయపడొద్దని, మన టైం వస్తదని, అప్పుడు వాళ్ల సంగతి చూద్దామని చెప్పారు. కార్యక్రమంలో డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్, పార్టీ నేతలు వై సతీశ్‌రెడ్డి, రంగినేని అభిలాశ్, పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, కురువ విజయ్‌కుమార్, పాటిమీది జగన్మోహన్రావు, సింధు, ఆదర్శ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇలాంటి కాంగ్రెస్‌ను చూడలేదు : విజయలక్ష్మి
ఏ తప్పూ చేయనివాళ్లను అరెస్టు చేయించి రేవంత్‌రెడ్డి వారి పొట్ట కొడుతున్నారని శశిధర్‌గౌడ్ తల్లి దుర్గం విజయలక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి పద్ధతి ఏమాత్రం బాగాలేదని పేర్కొన్నారు. ‘ఏమో చేసిన అని రేవంత్‌రెడ్డి పొంగుతున్నరు. పొంగినపాలు పొయ్యిపాలే. రేవంత్ మిడిసిమిడిసి పడుతున్నడు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నదనే ధైర్యం మాకు ఉన్నది. నా కుమారుడిని గేటు మీది నుంచి అవతలికి ఎత్తేశారు. వృద్ధురాలిని అని చూడకుండా నన్ను నెట్టేశారు. అప్పటి నుంచి ఛాతీలో నొప్పిగా ఉన్నది. నేను కాంగ్రెస్ పార్టీని చూశా. కానీ, ఇలాంటి కాంగ్రెస్ పార్టీని ఫస్ట్‌టైమ్ చూస్తున్నా. రేవంత్‌రెడ్డి ఏమనుకుంటున్నాడో. మాకూ టైం వస్తది. అప్పుడు వాళ్ల పనిచేస్తాం’ అని హెచ్చరించారు.