హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలలో పనిచేస్తున్న పార్ట్ టైం, ఔట్సోర్సింగ్ టీచర్ల 4నెలల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ర అధ్యక్షుడు ఎస్ రజనీకాంత్, ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని సంఘం కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలలో ఇప్పటికే పూర్తిస్థాయిలో ప్రభుత్వం పోస్టులు భర్తీ చేయలేదని, పాఠాలు చెబుతున్న పార్ట్ టైం, ఔట్ సోర్సింగ్ టీచర్లు వేతనాలను కూడా విడుదల చేయకపోతే విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు రెండేండ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పాఠశాలల్లో చదువుతున్న వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పాఠశాలలకు ఇవ్వాల్సిన రూ.154కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ) : వరల్డ్ స్కిల్ కాంపిటీషన్-2026 పేరిట చైనాలోని షాంగై నగరంలో 2026 సెప్టెంబర్‌లో పో టీలు జరగనున్నాయి. ఈ పోటీలకు సబంధించిన వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, ఇండియా స్కిల్ కాంపిటీషన్ స్టేట్ కోఆర్డినేటర్ ప్రశాంతి సోమవారం మీడియాకు వెల్లడించారు. తొలుత జిల్లా, జోనల్‌స్థాయిలో పోటీలు జరుగుతాయని, ఆ తర్వాత రీజినల్/జోనల్, స్టేట్స్థాయిలో పోటీలుంటాయని, ఫిబ్రవరి 2026లో జాతీయస్థాయి పోటీలు ఉండనున్నట్టు తెలిపారు.
స్టేట్‌లెవల్ పోటీలను ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో నిర్వహించనున్నట్టు చెప్పారు. జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచినవారు వరల్డ్ స్కిల్ కాంపింటీషన్‌కు అర్హత సాధించనున్నట్టు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ, వెబ్ టెక్నాలజీస్, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ నెట్వర్క్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్, ఎలక్ట్రానిక్స్, బ్రిక్ లేయింగ్ వంటి 63 స్కిల్స్‌కు సంబంధించి పోటీలుంటాయని, ఆశావహులు skillindiadigital.gov.inలో అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.