సికింద్రాబాద్, మార్చి 13: పేద యువతకు పోలీస్ శిక్షణ ఇచ్చి, తనలాంటి పోలీసులను తయారు చేయాలన్నదే అడిషనల్ డీసీపీ పరవస్తు మధుకర్ స్వామి ధ్యేయం. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఈయన ఉచిత శిక్షణ ఇచ్చి, ఇప్పటి వరకు 400 మంది పోలీసులను తయారు చేశారు. 20 ఏండ్ల కిందట.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్, వనపర్తిలో సీఐగా పనిచేసినప్పటి నుంచే పేద యువతకు శిక్షణ ఇచ్చిన మధుకర్ స్వామి.. హైదరాబాద్ కేంద్రంగా 2001లో ఫౌండేషన్ను స్థాపించారు. ఆ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దానికోసం ఇంట్లో జరిగే ఎన్నో వేడుకలను కూడా రద్దు చేసుకొన్నారు. ఆ డబ్బును యువతకు శిక్షణ ఇచ్చేందుకు, సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తున్నారు. ఆయనకు బంధువులు, మిత్రులు కూడా తోడయ్యారు. గతంలో మహబూబ్నగర్ జిల్లాలో ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేసిన హుస్సేన్బాబు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వినయ్ షీలా ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్నారు. కాగా, సామాజిక కార్యక్రమాల్లోనూ మధుకర్ స్వామి చురుగ్గా ఉంటారు. తాను పనిచేసిన పట్టణాల్లోని పలు ప్రాంతాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తుంటారు. రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, పచ్చదనాన్ని పెంచటంలో తోడ్పాటునందిస్తున్నారు.
ఒక్కో అభ్యర్థిపై రూ.3 లక్షల ఖర్చు
ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ శిక్షణ తీసుకొనే అభ్యర్థులకు అన్నీ ఉచితంగానే అందజేస్తున్నారు. మంచి పౌష్ఠికాహారం అందిస్తున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రికి భోజనంతో పాటు మధ్యలో రెండు సార్లు స్నాక్స్ అందజేస్తున్నారు. అన్ని వసతులు కల్పించారు. బయట ఈ కోచింగ్కు ఒక్కొక్కరికి సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుందని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు చెప్తున్నారు. 2006లో శిక్షణ పొందిన ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రత్యేక అనుమతి తీసుకొని ఇక్కడ వలంటీర్లుగా పని చేస్తున్నారు. 150 మంది యువతీ యువకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక్కడ అమ్మాయిలకు ప్రత్యేకంగా వసతి కల్పించారు. డ్రెస్, షూ పంపిణీ చేసి డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ రకాల శిక్షణలు ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం యోగా, హై జంప్, లాంగ్ జంప్ వంటివి ప్రాక్టీస్ చేయిస్తున్నారు. 9 గంటల నుంచి సాయంత్రం వరకు థియరీ క్లాసులు నడుస్తున్నాయి. స్థానికంగా ఉండే వారే కాకుండా వివిధ సబ్జెక్టుల్లో నిపుణులైన ఫ్యాకల్టీలను రప్పించి అభ్యర్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. వారాంతపు పరీక్షలు నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందుతున్నవారిలో ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారూ ఉన్నారు.
ఆయనో పోలీస్ ఉన్నతోద్యోగి.. నేరస్థులను గాడిలో పెట్టడమే తన పని అనుకోలేదు. పేద యువతను దారిలో పెట్టడమూ బాధ్యతగా భావించారు. సరైన శిక్షణ లేక, శిక్షణ తీసుకొనే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోతున్న ఎంతోమందికి అండగా నిలవాలనుకొన్నారు. ఒక ఫౌండేషన్ స్థాపించి వందల మంది పేద యువతీ యువకులకు పోలీస్ శిక్షణ ఇస్తున్నారు. ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నారు. ఆయనే.. అడిషనల్ డీసీపీ పరవస్తు మధుకర్ స్వామి. ఆయన స్థాపించిన ఫౌండేషన్ పేరు.. పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్.
ఉచిత శిక్షణ సాగుతున్నదిలా..
ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాచ్!
ప్రస్తుత శిక్షణ ఈ నెల 31తో ముగియనున్నది. ఇప్పటి వరకు 7 బ్యాచ్లకు శిక్షణ ఇవ్వగా, ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభించేందుకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ సన్నాహాలు చేస్తున్నది. ఈ నెల చివరి వారంలో ఆయా జిల్లాకేంద్రాల్లో అర్హత పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అర్హత పరీక్షల్లో మెరిట్ సాధించిన నిరుద్యోగులకు ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు ఫోన్నంబర్ 8328272336ను సంప్రదించాలని ఫౌండేషన్ డైరెక్టర్ గద్దె భాస్కర్ పేర్కొన్నారు.
తప్పకుండా ఉద్యోగం సాధిస్తా
పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వారు అన్ని వసతులతో ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేయటంతో పాటు మమ్మల్ని సొంత కుటుంబ సభ్యులుగా చూసుకొంటున్నారు. నాకు చిన్నతనం నుంచే ఎస్సై కావాలన్న కోరిక. మధుకర్ సార్ చలవ, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో తప్పక ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం ఏర్పడింది.
– అఖిల, నల్లగొండ
లక్షలు వెచ్చించినా ఇలాంటి శిక్షణ దొరకదు
నేను పోలీస్ ఉద్యోగం సాధించడానికి ఇక్కడి ఉచిత శిక్షణ ఎంతో ఉపయోగపడింది. రూ.లక్షలు ఖర్చు చేసినా ఇలాంటి శిక్షణ దొరకదు. శిక్షణలో భాగంగా అన్ని వసతులను కల్పిస్తున్నారు. ఉద్యోగం సాధించడానికి అవసరమైన అన్ని అంశాలను పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్లో నేర్పిస్తున్నారు. ప్రస్తుతం జగద్గిరిగుట్టలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాను.
– శ్రీకాంత్, ఎస్సై, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్
పేద యువత కోసం వేడుకలను రద్దు చేసుకొన్నాం
నాతోపాటు మా బంధువులు, మిత్రులం చిన్న చిన్న వేడుకలకు దూరంగా ఉంటున్నాం. వృథా ఖర్చులు పెట్టకుండా వాటిని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తాం. పేదరికంతో శిక్షణ పొందలేక, ఉద్యోగాలు రాక యువత ఇబ్బందులు పడుతున్నారు. వారికి దిశానిర్దేశం చేస్తే ఏదో ఒక రంగంలో స్థిరపడతారన్న ఆలోచనతో ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. దీన్ని ఉపయోగించుకొని వందల మంది ఉద్యోగాలు పొందుతుండటం సంతోషంగా ఉన్నది. – పరవస్తు మధుకర్ స్వామి, అడిషనల్ డీసీపీ, పరవస్తు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు