హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులు చదువులో రాణించడంలేదు. జాతీయ స్థాయి సగటు కంటే వెనుకబడి ఉన్నారు. ఈ మేరకు పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ (పరాక్) సర్వే-2024లో ఆందోళనకరమైన నిజాలు వెలుగుచూశాయి. పరాక్ను ఇదివరకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్)గా వ్యవహరించేవారు. మూడు, ఆరు, తొమ్మిదో తరగతి పిల్లలకు భాషలు, గణితం, సైన్స్‌లో ప్రతిభాపాటవాలను ఏ మేరకు ఉన్నాయో ఈ సర్వే ద్వారా తెలుసుకుంటారు.
దేశవ్యాప్తంగా విద్యాప్రమాణాలను అంచనా వేసేందుకు పరాక్ సర్వేను ప్రభుత్వాలు, విద్యాసంస్థలు కీలకంగా భావిస్తాయి. తాజాగా పరాక్-2024 సర్వే నివేదికను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం విద్యార్థులు వాక్యాలు చదవలేకపోతున్నారని, లెక్కలు చేయలేకపోతున్నారని, అంకెలను కూడా ఆరోహణ అవరోహణ క్రమంలో చెప్పలేకపోతున్నారని తేలింది. అంతేకాకుండా మూడో తరగతి విద్యార్థులకు సూర్యుడు, చంద్రుడి బొమ్మలను చూపిస్తే… ఏది ఏంటో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని సర్వేలో స్పష్టమైంది. చాలా అంశాల్లో జాతీయ సగటుతో పోల్చితే తెలంగాణ రాష్ట్రం వెనుకబడిందని తేలింది.