ఖమ్మం : జిల్లాలోని కామేపల్లి మండలం పండితాపురం పశువుల వారాంతపు సంతకు రాష్ట్రంలోనే గుర్తింపు ఉంది. ఏటా సంత కౌలు నిమిత్తం నిర్వహించే బహిరంగ వేలం పాటలో గుత్తేదారులు పోటీ పడడంతో సంత రూ.కోట్లు పలుకుతుంది. కామేపల్లి మండలం కొమ్మినేపల్లి పంచాయతీ పరిధిలోని పండితాపురం శ్రీకృష్ణప్రసాద్ పశువుల సంత వేలం రూ.2.16 కోటు పలికింది.
సర్పంచ్ మూడ్ దుర్గాజ్యోతి అధ్యక్షతన జడ్పీ సీఈవో ఇంజం అప్పారావు సమక్షంలో సంత ఆవరణంలో సోమవారం 2022-2023 ఆర్థిక సంవత్సరానికి బహిరంగ వేలం నిర్వహించారు. వేలంలో ఆరుగురు గుత్తేదారులు పాల్గొన్నారు. ఇరువురి గుత్తేదారుల మధ్య హోరాహోరీగా సాగిన వేలం పాటలో ధరావత్ నాగేశ్వరరావుపై భుక్యా వీరన్న హెచ్చు పాటదారుడిగా నిలిచి సంత కౌలును కైవసం చేసుకున్నాడు. రికార్డుస్థాయిలో సంత వేలం పాట రావడంతో గ్రామ పంచాయతీకి మంచి ఆదాయం వచ్చిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.