Palamuru Lift Irrigation | త్వరితగతిన పూర్తవడమే కాదు, సాగునీటి గతిని, రాష్ట్ర ప్రగతిని మలుపుతిప్పడమే తెలంగాణ ప్రాజెక్టుల ప్రత్యేకత. కాళేశ్వరం బాటలోనే ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి బృహత్ నిర్మాణాలకు వేదిక అవుతున్నది. ఏదుల వద్ద నిర్మిస్తున్న అత్యంత భారీ సర్జ్‌పూల్ ‘భూగర్భ’ నిర్మాణాల్లో ఆసియాలోనే అతిపెద్దదిగా నిలవనున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాగునీటి రంగం కొత్త పుంతలు తొక్కుతుండడమేకాదు సరికొత్త రికార్డులను సైతం నెలకొల్పుతున్నది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అతి భారీ, సంక్లిష్ట, వినూత్న నిర్మాణాలకు చిరునామాగా నిలుస్తున్నది. ఇందుకు శరవేగంగా నిర్మాణమవుతున్న పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉదాహరణగా నిలుస్తున్నది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పలు సర్జ్‌పూల్స్, పంప్‌హౌజ్‌లు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద నిర్మాణాలుగా ఖ్యాతిని సొంతం చేసుకొంటున్నాయి. ఇప్పటికే నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న దేవాదుల ఎత్తిపోతల పథకంలో చేపట్టిన నిర్మాణాలను మించిన సామర్థ్యంతో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భారీ నిర్మాణాలు సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి.
పంపింగ్ మోటర్లకు సరిపడా మోతాదులో నీటిని అందుబాటులో ఉంచేందుకు ఏర్పాటు చేసే నిర్మాణాలనే సర్జ్‌పూల్స్ అంటారు. నీటి వనరుల ఇన్‌టేక్ పాయింట్ హెడ్‌రెగ్యులేటర్ల నుంచి వచ్చిన నీటిని తొలుత సర్జ్పూల్స్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి డ్రాఫ్ట్ ట్యూబ్‌ల ద్వారా పంపింగ్ మోటర్లకు సరఫరా చేస్తారు. తెలంగాణలో ఇప్పటికే పలురకాల సర్జ్‌పూల్స్‌ను నిర్మించగా.. అందులో ఎక్కువగా అండర్‌గ్రౌండ్ (కెవిన్) సర్జ్‌పూల్స్ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో తొలిసారిగా అతిపెద్ద ఓపెన్ సర్జ్‌పూల్‌ను నిర్మించారు. ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్టులో షాఫ్ట్ సర్జిపూల్‌ను నిర్మిస్తున్నారు. ఇవి రెండూ వేటికవే ఆసియాలోనే అతిపెద్దవిగా రికార్డులకు ఎక్కాయి. తాజాగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఏదులలో నిర్మిస్తున్న సర్జ్‌పూల్ కూడా ఆ రెండు సర్జ్‌పూల్స్ సరసన నిలువనుండడం విశేషం.
దేవాదుల ఎత్తిపోతల పథకం 3 ఫేజ్‌లో నిర్మిస్తున్న షాఫ్ట్ సర్జిపూల్ కూడా ప్రత్యేకతను చాటుకొన్నది. ఇప్పటివరకూ సర్జ్‌పూల్స్‌ను నిర్మించి అక్కడి నుంచి పంప్‌హౌజ్‌లకు నీటిని తరలించగా, ఇక్కడ నేరుగా సర్జ్‌పూల్ నుంచే నేరుగా పైపుల ద్వారా లిఫ్ట్ చేయడం విశేషం. అంటే బావిలో నుంచి మోటర్ ద్వారా నీటిని తోడినట్టుగానే ఉంటుంది. అందుకే దీనిని ‘డీప్‌వెల్ టైప్ సర్జ్‌పూల్’ అని కూడా పిలుస్తున్నారు. ఈ సర్జిపూల్‌ను 25 మీటర్ల వ్యాసార్థంతో.. దాదాపు 135 మీటర్ల లోతుతో ఏర్పాటు చేయగా ఇది కూడా ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డులకు ఎక్కింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్మిస్తున్న అండర్‌గ్రౌండ్ (కెవిన్) సర్జిపూల్ కూడా ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డులకు ఎక్కనుండడం విశేషం. ఇప్పటిరకూ కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 8లో గాయత్రి పంప్‌హౌజ్ వద్ద నిర్మించిన సర్జ్‌పూల్ అతిపెద్దదిగా రికార్డులకు ఎక్కింది. ఈ సర్జ్‌పూల్‌ను 350 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 54 మీటర్లతో ఎత్తుతో నిర్మించారు. ఇప్పుడు అంతకు మించిన కెవిన్‌ను పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో నిర్మిస్తుండడం విశేషం. ప్రాజెక్టులోని ప్యాకేజీ -5లో నిర్మిస్తున్న ఏదుల పంప్‌హౌజ్, సర్జ్‌పూల్ నిర్మాణాలు ఆ ఘనతను సాధించాయి. ఏదుల వద్ద నిర్మిస్తున్న సర్జ్‌పూల్ పొడవు 357 మీటర్లు కాగా, వెడల్పు 30 మీటర్లు, ఎత్తు ఏకంగా 90 మీటర్లు. అంటే దాదాపు పావు కిలోమీటరుకుపైగా పొడవు, 30 అంతస్థులతో దీన్ని నిర్మించారు. సర్జ్‌పూల్ అడుగు భాగం సముద్రమట్టానికి 274 మీటర్ల ఎత్తులో ఉండగా, అక్కడి నుంచి 341 మీటర్ల వరకు నీరు ఉండనున్నది. 279 మీటర్ల నుంచి నీటిని డ్రాఫ్ట్ ట్యూబ్‌ల ద్వారా మోటర్లకు
తరలించనున్నారు.
ఆసియాలోనే తొలిసారిగా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక వినూత్న నిర్మాణాన్ని చేపట్టారు. లింక్-4లో శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి గోదావరి జలాలను అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి లిఫ్ట్ చేసేందుకు భారీ ఓపెన్ సర్జ్‌పూల్‌ను నిర్మించారు. అదీగాక తొలిసారి వృత్తాకారంలో సర్జ్‌పూల్‌ను ఏర్పాటు చేశారు. 92 మీటర్ల లోతు, 56 మీటర్ల వ్యాసార్థంతో దీన్ని నిర్మించారు. ఈ సర్జ్‌పూల్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నారు. ఈ వృత్తాకార సర్జ్‌పూల్ ఆసియాలోనే అతిపెద్దిగా రికార్డులకు ఎక్కింది. అప్పటివరకు దేశంలో ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ ప్రాజెక్టులో 38 మీటర్ల డయా, హిమాచల్‌ప్రదేశ్‌లోని మరో ప్రాజెక్టులో 32 మీటర్ల డయాతో నిర్మించిన సర్జ్‌పూల్స్ పెద్దవికాగా, ఆ రికార్డులను ఇది బ్రేక్ చేసి కొత్త రికార్డును నెలకొల్పింది.
ఏదుల సర్జ్‌పూల్ మాత్రమే కాదు పంప్‌హౌజ్ కూడా అతిపెద్దది కావడం మరోవిశేషం. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 8లో నిర్మించిన గాయత్రి పంప్‌హౌస్ అతిపెద్దిదిగా రికార్డులకు ఎక్కింది. ఈ పంప్‌హౌజ్ 25 మీటర్ల వెడల్పు, 65 మీటర్ల ఎత్తు, 360 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ పంప్‌హౌజ్‌లోని 139 మెగావాట్ల సామర్థ్యమున్న పంపులు నీటిని ఏకంగా 111 మీటర్లకుపైకి ఎత్తిపోస్తున్నాయి. ప్రస్తుతం ఈ రికార్డును ఏదుల పంప్‌హౌజ్ బ్రేక్ చేసింది. ఏదుల పంప్‌హౌజ్ పొడవు 402 మీటర్లు, ఎత్తు 60 మీటర్లు, వెడల్పు 26 మీటర్లు కావడం విశేషం. అదీగాక ఈ పంప్‌హౌజ్‌లోని 145 మెగావాట్ల పంపులు నీటిని ఏకంగా 124 మీటర్ల పైకి ఎత్తిపోయనున్నాయి. ఇది కూడా ఒక రికార్డుగా నమోదు కానుండడం విశేషం.
-మ్యాకం రవికుమార్