Congress | తొర్రూరు/హైదరాబాద్ జూలై 11 (నమస్తే తెలంగాణ): పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్వినీరెడ్డి గెలుపుకోసం రాత్రీపగలు కష్టపడ్డాడా గిరిజన యువకుడు. ఆమె గెలవాలని ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులూ పెట్టాడు. అతడు కోరుకున్నట్టే యశస్వినీరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. కానీ, ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడని ఆ యువకుడిని పోలీసులతో దారుణంగా కొట్టించారు. వివరాల్లోకెళితే.. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి మూడు రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఆ సందర్భంలో ఎమ్మెల్యే వెంట ఆమె పీఏలు విజయేందర్‌రెడ్డి, రాజేశ్ తదితరులు సీఎంతో ఫొటోలు దిగారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం భోజ్యతండా పరిధి ఈదులకుంట తండాకు చెందిన మాలోత్ సురేశ్‌బాబు (ఎల్‌హెచ్‌పీఎస్ అధ్యక్షుడు, ఆమ్ఆద్మీపార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు) వాటిపై పలు కామెంట్లు పెట్టాడు. ‘స్థానిక లీడర్లను పక్కనపెట్టి పీఏలతో రాజకీయాలు తగునా? విజయేందర్‌రెడ్డి పీఏనా? లేకుంటే రెడ్డిరాజ్యంలో దగాకోరు రెడ్డినా? సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పాలకుర్తి అభివృద్ధి కోసం నిధులు కావాలని కోరినప్పుడు విజయేందర్‌రెడ్డి అనే వ్యక్తిని కాకుండా నియోజకవర్గంలో ఉన్న ఏ చిన్న ఓటరును పిలిచినా నిధులు దేనికి అవసరమో చెప్పేవాళ్లు.
సీఎం ముందు ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల పరువు తీస్తున్నారు. అసలు పాలకుర్తిలో ఎమ్మెల్యే ఎవరు? నాయకులు ఎవరు? కార్యకర్తలు ఎవరు? నియోజకవర్గ అభివృద్ధి కోసం పీఏలు సైతం సీఎం కలుస్తారా? అసలు నిధులు దేనికి కావాలని అడిగారో నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉంది. అమ్మ అమెరికా నుంచి ఒక్కరిగా వచ్చి, ఇక్కడ గెలిచి మళ్లీ బ్యాగులు, మూటలు ఆమెరికాకు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా?’ అని ప్రశ్నించాడు.
ఈ పోస్ట్‌పై సురేశ్‌బాబును ఎమ్మెల్యే అనుచరులు, పీఏ విజయేందర్‌రెడ్డి పిలిచి ప్రశ్నించినట్టు తెలిసింది. అతడు ఇంకా బలంగా వాదన చేయటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని పలువురు చెప్తున్నారు. దీంతో బుధవారం సాయంత్రం సురేశ్నాయక్ను స్థానిక ఎస్సై జగదీశ్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టారని ఎల్‌హెచ్‌పీఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే పీఏ విజయేందర్‌రెడ్డి ప్రోద్బలంతోనే ఎస్సై తీవ్రంగా కొట్టి భయభ్రాంతులకు గురి చేశారని బాధితుడు, అతడి తల్లిదండ్రులు పద్మ, శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సురేశ్‌బాబును పోలీసులు అదుపులోకి తీసుకొని క్రూరంగా హింసించారని తెలిపారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వాట్సాప్‌లో పోస్ట్ చేయడమే ఆయన చేసిన నేరమా? అని డీజీపీని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల ప్రొఫెషనలిజానికి మంచి పేరు ఉండేదని, అదిపోకుండా కాపాడుకోవాలని సూచించారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసులను అదుపు చేయాలని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు మాలోత్ సురేశ్‌ను హింసించటం బాధాకరమని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. తొర్రూరు పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని, బాధితుడి తల్లి ఆవేదనను అర్థం చేసుకోవాలని, తెలంగాణ డీజీపీ విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోకాల్డ్ కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రశ్నించే గొంతులను నొకేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని విమర్శించారు.
తొర్రూరు, జూలై 11: మాలోత్ సురేశ్ కుటుంబానికి అండగా ఉంటామని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. గురువారం సాయంత్రం బాధితుడిని పరామర్శించిన ఆయన.. సురేశ్ కుటుంబసభ్యులను కలిసి అన్నివిధాలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. అక్కడి నుంచే మహబూబాబాద్ ఎస్పీకి ఫోన్ చేసి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, అవసరమైతే ఆందోళనలు చేస్తామని వెల్లడించారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి పీఏ విజయేందర్‌రెడ్డి నియంతలా ఒంటెద్దు పోకడలు పోతున్నాడు. తనే రూల్ చేస్తున్నాడు. ఇక్కడ రెడ్డి పాలన కొనసాగుతున్నదన్న అనుమానం కలుగుతున్నది. ఆయనపై చర్యలు తీసుకోవాలి. మీ(ఎమ్మెల్యే) గెలుపు కోసం పనిచేసిన ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని మీకు తెలిసేలా సోషల్ మీడియాలో పోస్టు చేశాను. దీనిపై వారి మనోభావాలు దెబ్బతిన్నాయని విజయేందర్‌తోపాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎస్సైకి ఫిర్యాదు చేశారు.
దీంతో ఎస్సై జగదీశ్ నానాబూతులు తిట్టి తీవ్రంగా కొట్టారు. కేసు పెడితే జైలుకైనా పోయేవాన్ని. కానీ ఇలా కొట్టిస్తే మీ పార్టీకే నష్టం. మా కుటుంబం గత 40-50 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ, సేవ చేస్తున్నం. నేను పెట్టిన పోస్టుపై ఇబ్బంది అనిపిస్తే క్షమాపణ చెప్పడానికి సిద్ధపడిన. పోలీసులకు చెప్పి నా ఫోన్లు లాక్కుని నా పర్సనల్ డాటాను చెక్ చేశారు. స్టేషన్లో విజయేందర్‌రెడ్డి నన్ను, నా తండ్రిని నానాబూతులు తిట్టారు. తెలంగాణ కోసం ఉద్యమించా.
యశస్వినీరెడ్డి గెలుపు కోసం పనిచేశా. దయాకర్‌రావును ఓడగొట్టి, యశస్వినీరెడ్డిని గెలిపించేందుకు దయాకర్‌రావుపై సోషల్‌మీడియాలో ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారాలతో పోస్టులు పెట్టా. నేనేం తప్పు చేశానని ఇలా కొట్టించారు. 8 నెలల్లోనే ఇన్ని ఘోరాలు చూస్తానని అనుకోలేదు. వెంటనే నన్ను కొట్టిన ఎస్సై, కొట్టించిన విజయేందర్‌రెడ్డిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా.
– బాధితుడు సురేశ్‌బాబు