హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : గుండె పనితీరును క్ర మబద్ధీకరించే పేస్మేకర్లు ఉన్న రోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా ఎంఆర్ఐ పరీక్షలు చేసుకోవచ్చని హోలిస్టిక్ వైద్యులు నిరూపించారు. ‘ఆటో ఎంఆర్ఐ కార్డియాక్ రీ-సింక్రొనైజేషన్ పేసింగ్’ అనే డివైజ్‌తో ఇది సాధ్యమని శ్రీశ్రీ హోలిస్టిక్ దవాఖాన కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ నిపుణుడు డాక్టర్ వీఎస్ రామచంద్ర తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఈ విధానంతో హైదరాబాద్ నగరానికి చెందిన ఒక మహిళకు విజయవంతంగా చికిత్స చేసినట్టు వెల్లడించారు. నగరానికి చెందిన అరుణ (55) రెండేండ్లుగా తీవ్రమైన ఆయాసంతో బాధపడుతున్నారు. పలు దవాఖానల్లో చికిత్స పొందుతూ మందులు వాడినప్పటికీ ఆమె గుండె పనితీరు పూర్తిగా క్షీణించిపోయింది.
దీంతో రోగిని పరీక్షించిన డాక్టర్లు వీఎస్ రామచంద్ర, శ్రవణ్ పెరావళి, నీలేశ్ చైతన్యరెడ్డి, భరణి వేలన్ బృందం తదుపరి వైద్యపరీక్షలు నిర్వహించి, రోగి ‘కండక్షన్ అబ్నార్మాలిటీ’ సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ‘ఆటోఎంఆర్ఐ కార్డియాక్ రీ-సింక్రొనైజేషన్ పేసింగ్’ అనే డివైస్ ద్వారా రోగికి విజయవంతంగా చికిత్స అందించగలిగామని తెలిపారు. ఈ డివైజ్ వల్ల ఎంఆర్ఐ చేసే సమయంలో స్విచ్ ఆఫ్, ఆన్ చేయాల్సిన పనిలేదని, ఎంఆర్ఐ సమయంలో డివైజ్ దానంతట అదే స్విచ్ ఆఫ్ అవడంతోపాటు స్కాన్ పూర్తవగానే మళ్లీ స్విచ్ ఆన్ అవుతుందని వివరించారు.