హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): గిరిజన సంక్షేమ శాఖలో నిబంధనలకు పాతరేస్తున్నారు. అక్రమ మార్గంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిని రెగ్యులరైజ్ చేసేందుకు రంగం సిద్ధంచేశారు. శనివారం నిర్వహించనున్న తెలంగాణ గిరిజన ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ట్రైకార్) బోర్డు సమావేశంలో ఆ మేరకు ఆమోదముద్ర వేసేందుకు ఇప్పటికే నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ట్రైకార్లో మేనేజర్ స్థాయిలో ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఒకరు 2005లో సెర్ప్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికపై కమ్యూనిటీ కోఆర్డినేటర్‌గా చేరారు. తర్వాత అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్‌గా హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్న సదరు ఉద్యోగి ఏకంగా సెర్ప్ నుంచి డిప్యూటేషన్‌పై ట్రైకార్‌కు వచ్చి అక్కడే పాగా వేశారు. పలుకుబడిని ఉపయోగించి, కొందరు అధికారులను మచ్చిక చేసుకుని రెగ్యులరైజ్ కోసం పావులు కదిపారు. ఆ మేరకు ప్రతిపాదలు పంపారు.
అయితే సదరు ఔట్సోర్సింగ్ ఉద్యోగి ప్రయత్నాలకు నాటి ట్రైకార్ బోర్డు సభ్యులు నిరాకరించారు. నిబంధనలకు సరితూగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం నిరాకరించింది. ప్రస్తుతం ట్రైబల్వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని ఒక ఉన్నతాధికారి ద్వారా మళ్లీ ఇప్పుడు మళ్లీ పావులు కదిపారు. శనివారం బోర్డు సమావేశంలో దీనిని ఎజెండాగా పొందుపరిచారు. ట్రైకార్ ద్వారా అమలుచేస్తున్న యువ వికాసం పథకంపై సమీక్ష కోసం బోర్డు మీటింగ్ పెట్టినట్టు చెప్తున్నప్పటికీ, ఎజెండాలో రెండో అంశంగా చేర్చిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి సర్వీసును రెగ్యులరైజ్ చేయడమే ప్రధానమని గిరిజన సంక్షేమశాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారితోపాటు పలువురు ఉద్యోగులు ఆమోదం తెలిపారని, బోర్డు మీటింగ్‌లో ఆమోదం తెలపడమే లాంఛనమేనని చెప్తున్నారు. ఈ వ్యవహారం వెనక పెద్ద మొత్తంలో చేతులు మారినట్టు సంక్షేమభవన్ అధికారులు చర్చించుకుంటున్నారు.