హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎక్కడ చూసినా ‘ఓ రైతు రేపు రా’ అనే మాట ట్రెండింగ్లో ఉన్నది. యూరియా కోసం ప్యాక్స్ కేంద్రాలకు వెళ్తున్న రైతులకు ‘స్టాక్ లేదు రేపు రండి’ అంటూ అధికారులు చెప్తున్నారు. ప్రతీ రోజు ‘రేపు రా’ అని చెప్పడమే తప్ప… ఏ రోజూ ఒక్క బస్తా యూరియా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రెండు మూడు రోజులు తిరిగితే.. చివరికి ఒక్కో రైతుకు ఒకటి లేదా రెండుకు మించి యూరియా బస్తాలు ఇవ్వడం లేదు. ఈ విధంగా రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రస్థాయికి చేరుకున్నది. మరోవైపు సరిపడా స్టాక్ అందుబాటులో పెట్టాల్సిన ప్రభుత్వం.. రైతులను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నది.
అధికారులు రైతులకు టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతీ ప్యాక్స్ కేంద్రానికి సరిపడా యూరియా రాకపోవడంతో రైతులు బారులు తీరుతున్నారు. ప్రతీ కేంద్రం వద్ద క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. వర్షం కురుస్తున్నా.. రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. యూరియా కొరతపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రతీ కేంద్రం వద్ద వచ్చేది కొసరంత అయితే.. రైతులు మాత్రం భారీగా గుమిగూడుతున్నారు. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరుగుతున్నది. కాంగ్రెస్ సర్కారు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని, కనీసం యూరియా ఇవ్వట్లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అవసరానికి మించి కొనద్దు: తుమ్మల
రైతులు అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయడం మానుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు ఆదివారం యూరియా కొరతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యూరియా సరఫరాలో కేంద్రం విఫలమైందని చెప్పారు. 9.80 లక్షల మెట్రిక్ టన్నులకు గాను ఇప్పటివరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేసిందని చెప్పారు. యూరియా అమ్మకాలపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులకు లేఖలు రాయాలని ఆదేశించారు.
35 ఎకరాలకు మూడు బస్తాలేనా?
పత్తి ఏపుగా పెరిగి పూత దశలో ఉన్నది. యూరియా లేకపోవడం వల్ల ఎదుగుదల తగ్గిపోయింది. యూరియా వేద్దామనుకుంటే.. మూడు కట్టలు మాత్రమే ఇస్తామన్నారు. ఒక యూరియా కట్టకు మరో లీటరు నానో యూరియా అంటగడుతున్నారు. 35 ఎకరాలు సాగుచేస్తున్న నాకు మూడు కట్టలు ఏ విధంగా సరిపోతాయి?
-ఉపేంద్ర, రైతు, రావినూతల గ్రామం, ఖమ్మం జిల్లా
ఇన్ని తిప్పలు ఎప్పుడూ పడలేదు
ఇరవై ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్న. నాటు వేశాక యూరియా కోసం ఇన్ని తిప్పలు ఎప్పుడూ పడలేదు. పరిస్థితి ఘోరంగా ఉంది. పొలం వేసి నెల కావొస్తున్నది. యూరియా ఎప్పుడో చల్లాల్సి ఉండె. కానీ కొంత పొలానికే చల్లినం. రోజూ తెలిసిన వారికి ఫోన్ చేసి.. యూరియా ఉందా..? అని అడగాల్సి వస్తున్నది. యూరియా కష్టాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలె.
-శ్రీనివాస్, రంగపేట, కరీంనగర్ జిల్లా
పదిహేను రోజుల సంది తిరుగుతున్నా
నాటేసి 28 రోజులు అయింది. యూరియా కోసం పదిహేను రోజుల సంది తిరుగుతున్న. ఇప్పటివరకు ఒక్క సంచీ దొరకలేదు. పొలమంత ఎర్రవడ్డది. ఇప్పుడన్నా దొరకుతదేమోనని అల్మాస్పూర్ గోదాంకు వచ్చిన. లైన్లో ఉన్నా. ఒక్క సంచీ దొరకకపాయె. పొలం ఎర్రవడి కరాబైనంక యూరియా ఇచ్చినా ఏం లాభం?
-సోమ్లానాయక్, రైతు, బుగ్గరాజేశ్వర తండా, రాజన్న సిరిసిల్ల జిల్లా
కేసీఆర్ పాలనలో మంచిగుండె
రైతులు ఇబ్బందులు పడొద్దని కేసీఆర్ ముందు చూపుతో ఎరువులు, విత్తనాలను మందుల దుకాణాలు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, సోసైటీలలో అందుబాటులో పెట్టిన్రు. అప్పుడు రంది లేకుండా సాగు చేసుకున్నం. హాయిగా బతికినం. యూరి యా లేక ఇబ్బందులు పడుతున్నం
-నరేందర్నాయక్, రైతు, బచ్చురాజ్పల్లితండా, మెదక్ జిల్లా
ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు
నారు వేసిన 15 రోజుల్లో ఎకరాకు బస్తా యూరియా వేస్తేనే పైరు ఏపుగా పెరుగుతుంది. కానీ యూరియా దొరుకుతలేదు. పది రోజుల నుంచి తిరిగినా యూరియా దొరుకుతుందన్న నమ్మకం కలుగడం లేదు. యూరియా కోసం ఎప్పుడూ ఇంత ఇబ్బంది పడలేదు.
-నాగరాజు, రైతు, మూలమళ్ల, వనపర్తి జిల్లా
వర్షాలు పడ్డప్పుడే యూరియా వేయాలి
వర్షాలు పడ్డప్పుడే పంటలకు యూరియా వేయాల్సి ఉంటుంది. నాలుగైదు రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా దొరకడం లేదు. కోట్పల్లి, మర్పల్లి, పరిగి, వికారాబాద్ మండలాల్లో తిరిగినా యూరియా అందడం లేదు. బీఆర్ఎస్ పాలనలో యూరియా కొరత లేకుండే. ఇప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యూరియా అందుబాటులో పెట్టాలి.
-పరశురాం, నాసన్పల్లితండా వికారాబాద్ జిల్లా
నష్టాలు తప్పేలా లేవు
ఏడెకరాల వరి వేశాను. రెండు బస్తాల యూరియా ఇస్తామంటున్నారు. యూరియా కొరతతో దిగుబడులు రాక రైతులు నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయలేకపోతున్నది. ఎంత విస్తీర్ణంలో సాగు చేసే రైతులకైనా దమ్మపేట సొసైటీలో రెండు బస్తాలే ఇస్తున్నారు.
– రవీంద్ర, రైతు, అప్పారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా