కరీంనగర్, జూన్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న, రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ అలియాస్ అమర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక ఇంటిపైకి ప్రభుత్వం బుల్డోజర్ ప్రయోగించింది. వేములవాడలోని వారి నివాసాన్ని నేలమట్టం చేసింది. రాజన్న తల్లి కూర మల్లమ్మ 2019లో మృతి చెందేవరకు ఇదే ఇంట్లో నివసించారు. ప్రస్తుతానికి ఆ నివాసాన్ని పకన ఉన్న బంధువులు వినియోగించుకుంటున్నారు. వేములవాడలో రహదారి విస్తరణలో వీరి నివాసం మొత్తం నేలమట్టమైంది. పరిహారం అందకుండానే వీరి ఇల్లు నేలమట్టం కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం విమలక్కతోపాటు.. ఇతరులు కూల్చివేసిన ఇంటి వద్దకు వచ్చే అవకాశముందని తెలుస్తున్నది.
వేమలవాడ రాజన్న ఆలయ పరిధిలో రోడ్డు విస్తరణ కోసం సోమవారం అధికారులు తీసుకున్న చర్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు పనులు చేపట్టిన అధికారులు ప్రజలు, చిరువ్యాపారులపై బుల్డోజర్లు ప్రయోగించడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించి, భూమి స్వాధీనం చేసుకోవాలని అధికారులను, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కలిసి వేడుకున్నా ఫలితం లేకుండాపోయిందని బాధితులు తెలిపారు. ఆయా అంశాలపై స్పష్టత రాకముందే సోమవారం తెల్లవారుజాము నుంచే.. పోలీసుల పహారా మధ్య బుల్డోజర్లను రంగలోకి దింపి కూల్చివేసిన తీరుతో బాధితులు ఆందోళనకు గురయ్యాయి.
రోడ్డును 80 అడుగుల మేర విస్తరణ చేయాలని నిర్ణయించిన అధికారులు, 243 మంది నిర్వాసితులకు నోటీసులు ఇచ్చారు. ఇందులో కొంత మందికి మాత్రమే పరిహారం అందిందని, చాలామందికి బహిరంగ మార్కెట్ ప్రకారం పరిహారం ఇవ్వలేదని బాధితులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని అధికారులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించారు. ఏళ్ల తరబడిగా చిరు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నామని, ఒక్కసారిగా తమ భవనాలు కూల్చివేస్తే.. రోడ్డున పడాల్సివస్తుందని, తగిన పరిహారం ఇవ్వాలని విజప్తి చేశారు. అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో.. 88మంది హైకోర్టును ఆశ్రయించారు. కానీ ప్రభుత్వం, అధికారులు సోమవారం ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టడమేంటని నిలదీస్తున్నారు.
వేములవాడలోని మూల వాగు నుంచి రాజన్న ఆలయం వరకు అడుగడుగునా పోలీసులు పహారాగా నిలిచారు. జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో అమరవీల స్థూపం నుంచి రాజన్న ఆలయం వరకు దాదాపు 200 మంది పోలీసులను మోహరించారు. జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా కూల్చివేతలను పరిశీలించారు. ప్రజల నివాసాలు, చిరువ్యాపారుల దుకాణాలను కూల్చివేశారు. నోటీసుల గడువు ముగిసిన మరుసటి రోజు నుంచే.. కూల్చివేతలు చేపట్టడం వ్యాపార వర్గాలను కలిచివేసింది. పది బృందాలు ఏర్పాటు చేసి, ఒక్కో బృందానికి ఒకో తహసీల్దార్‌కు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించింది.