నమస్తే నెట్వర్క్, డిసెంబర్ 19 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని దళిత, ప్రజా సంఘాలు, బీసీ సంక్షేమ సంఘం, బీఆర్ఎస్, సీపీఎం, బీఎస్పీ, కాంగ్రెస్, స్వేరోస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమిత్‌షా వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ధర్నాలు, రాస్తారోకో నిర్వహించి అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్మల్ జిల్లాలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో దళితులు, అంబేద్కర్ అభిమానులు అమిత్‌షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్‌ను అవమానిస్తూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన రాస్తారోకోలో పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై పార్లమెంట్ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు హేయమని దళిత్ రైట్స్, సోషల్ జస్టిస్ కోఆర్డినేషన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు కమిటీ సభ్యులు మల్లేపల్లి లక్ష్మయ్య, బీ వెంకట్, రామచంద్ర డోమ్, వీఎస్ నిర్మల్, గుల్జర్ సింగ్ గోరియా, ధీరేంద్రఝా, విక్రమ్‌సింగ్, కర్నేల్ సింగ్, బీనా పల్లికల్, సాయి బాలాజీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమిత్‌షా వ్యాఖ్యలను నిరసిస్తూ, బేషరతుగా క్షమాపణలను చెప్పాలని డిమాండ్ చేస్తూ నేడు దేశవ్యాప్తంగా ధర్నా చేపట్టాలని దళిత హక్కుల సంఘాలకు, ప్రజాస్వామిక సంఘాలకు కమిటీ పిలుపునిచ్చింది.
ఎమ్మెల్యే మాణిక్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను బీజేపీ ప్రభుత్వం అవమానించిందని, అమిత్‌షా వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్‌రావు పేర్కొన్నారు. తక్షణమే అమిత్‌షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అంబేదర్ రాసిన రాజ్యాంగం, ఆయన ప్రసాదించిన రిజర్వేషన్లతోనే తాను ఎమ్మెల్యే అయ్యానని అనిల్‌జాదవ్ తెలిపారు. గ్రామాల్లో అంబేదర్ విగ్రహం అవసరమా? అని అమిత్‌షా అనడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. ఇందుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా గల్లీగల్లీలో అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పుతామని తెలిపారు.