Runa Mafi | సూర్యాపేట, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ‘నీకు రుణమాఫీ అయిందా? అంటే నీకు అయిందా? అనేదే ఇప్పుడు పల్లెల్లో ఏ నలుగురు కలిసినా వినిపిస్తున్న ముచ్చట. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కాంగ్రెస్ రుణమాఫీ చేసిందని గొప్పలు చెబుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంతూరు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామాన్ని నమస్తే తెలంగాణ సందర్శించింది. మంత్రి స్వగ్రామంలో 45శాతానికి మించి రుణమాఫీ కాకపోవడం గమనార్హం. ఈ గ్రామంలో 992 మంది రైతులకుగాను మూడు విడతల్లో కలిపి కేవలం 537మందికే రుణమాఫీ అయినట్టు తెలుస్తున్నది. తొలి విడతలో 357 మందికి, రెండో విడతలో 165 మందికి రుణమాఫీ అయ్యింది. మూడో విడతలో జాబితా ప్రకారం 15 మందికి మించి కాలేదని తెలుస్తున్నది. గ్రామంలో ఎవరినీ మందలించినా ఎక్కడిదయ్యా రుణమాఫీ అంటున్నారు. ‘మాకు రాలేదు.. మాకు రాలేదు’ అనే వారే ఎక్కువగా ఉన్నారు. గ్రామస్తుల మాట ప్రకారం ఉత్తమ్ ఊర్లో మాఫీ ఉత్తదేనని తేలింది. ప్రభుత్వం దిగివచ్చి ఇచ్చిన హామీ ప్రకారం రుణాలు మాఫీ చేయాలని, లేని పక్షంలో రైతుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
గివేం కొర్రీలు ..
ఎన్నికలప్పుడు పాస్ పుస్తకం ఉన్నోళ్లంతా బ్యాంకులకు వెళ్లి రుణం తీసుకోండి.. అధికారంలోకి రాగానే రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇవ్వకముందే మేము రుణాలు తీసుకున్నాం. ఇయ్యాల రేషన్కార్డుకే రెండు లక్షలట. మా కుటుంబం అందరి పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉన్నాయి. కాబట్టి మీకు రుణమాఫీకాదని అధికారులు అంటున్నారు. గివేం కొర్రీలు.. ఇదెక్కడి న్యాయం.
– కారుపోతుల అంజయ్య, తాటిపాముల, తిరుమలగిరి మండలం
రుణమాఫీ గందరగోళం
నేను 30 వేలు పంట రుణం తీసుకున్నా. అయినా రుణమాఫీ కాలేదు. ఇదెక్కడి న్యాయమో అర్థం కావడం లేదు. ఏమి అడిగినా లిస్టులో మీ పేరు లేదు.. మాకు తెలియదని అధికారులు అంటున్నరు. కావాలంటే దరఖాస్తు ఇవ్వండి చెబుతున్నారు. రుణమాఫీ అంతా గందరగోళం.
– కారుపోతుల శ్రీకాంత్, తాటిపాముల, తిరుమలగిరి మండలం
ఇంత మోసమా..?
నేను, నా భర్తకు వేర్వేరుగా పాస్ బుక్కులు ఉన్నాయి. నేను లక్షా 36వేలు, నా భర్త నక్కల యాదగిరి లక్షా 20 వేలు తీసుకున్నాం. ఇద్దరి పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉన్నాయని మాకు రుణమాఫీ కాలేదని అధికారులు చెబుతున్నరు. భార్యభర్తలకు రెండు రేషన్ కార్డులు ఉంటాయా..? ఇంత మోసమా..? రుణం ఇచ్చేటప్పుడు ఏ కండిషన్లు పెట్టకుండా రుణమాఫీ చేసేటప్పుడు ఈ కండిషన్లు ఏంటిదో.
-నక్కల సైదమ్మ, తాటిపాముల,తిరుమలగిరి మండలం
ఇదేం రుణమాఫీ..ఇదేం ప్రభుత్వం
నేను లక్ష 60వేల పంట రుణం తీసుకున్నా. మూడో విడుతలోనైనా రుణమాఫీ జరుగుతుందని ఆశించాను. నాకు రేషన్ కార్డు లేదని జాబితాలో పేరు రాలేదు. ఇదేం ప్రభుత్వం. ఇదేం రుణమాఫీ. బ్యాంకుల్లో అప్పులు తీసుకునేందుకు ఉన్న నిబంధనలు మాఫీ చేసేందుకు వర్తించవా ?
– దయా యాదవ్, తాటిపాముల,తిరుమలగిరి మండలం